Monday, 2 December 2013

నా భార్యకు వాటా లేదా?

మా అత్తామామలకు ఇద్దరు కూతుళ్లు. ముగ్గురు కొడుకులు. చిన్న కూతురుతో నా వివాహం 1979లో జరిగింది. 1985లో నేను చేసిన ధాన్యం వ్యాపారంలో వచ్చిన నష్టం కారణంగా బాగా అప్పుల పాలయ్యాను. అయితే, నా వద్ద ఉన్న 30 తులాల బంగారం కుదువపెట్టి ఆ అప్పులు తీర్చేశాను. ఈ విషయం తెలిసిన మా మామయ్య ఆ డ బ్బులు కట్టి బంగారం తెచ్చేశాడు. అప్పటికి ఇంకా మా వద్ద మిగిలి ఉన్న మిగతా బంగారం కూడా తీసుకుని, మొత్తం బంగారం తన వద్దే పెట్టుకున్నాడు. కొద్ది రోజుల తరువాత బంగారానికి సంబంధించి మా మామగారికి ఇవ్వవలసిన మొత్తం డబ్బులు ఇచ్చేశాం. అయినా తన వద్ద ఉన్న బంగారం మాత్రం మాకు తిరిగి ఇవ్వడం లేదు. ఎన్ని సార్లు అడిగినా ఏదో ఒక సాకు చెబుతూ వచ్చాడు. అయితే 2006లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మా మామగారు చనిపోయారు. ఆ తరువాత నా భార్య, బంగారం గురించి తన ముగ్గురు తమ్ముళ్లను అడిగితే, మా నాన్న వద్ద మీ బంగారం ఉన్నట్లు లిఖితపూర్వకమైన ఆధారం చూపమంటున్నారు.

నిజానికి నా వద్ద అలాంటి ఏ ఒక్క ఆ«ధారమూ లేదు. ఇక రెండవ విషయం. మా మామగారు, ఊళ్లో మా మామగారి పేరిటతన స్వార్జితమైన 15 ఎకరాల వ్యవసాయ భూమి, మా అత్తగారి పేరిట (50-బి ప్రకారం) 10 ఎకరాలు ఉంది. అలాగే హైదరాబాద్‌లో తన ఇద్దరు కొడుకుల పేరిట 300 గజాల ప్లాటు కూడా కొన్నాడు. మా అత్తగారి పేరిట ఉన్న భూమిని 1992లో ముగ్గురు కొడుకుల పేరిట ఆర్ఓఆర్‌లో బదిలీ చేయించాడు. అలాగే మా అత్తగారు బతికుండగానే మా మామగారు, తన పేరిట ఉన్న భూమిని 2007లో ముగ్గురు కొడుకుల పేరిట ఆర్ఓఆర్‌లో బదిలీ చేయించాడు. అయితే 2009లో రెండవ కుమారుడు తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నాడు. మా అత్తయ్య 2009లో రిజిస్టర్ అయిన కొద్దిరోజులకే చనిపోయింది. మా అత్త పేరిట ఉన్న 10 ఎకరాల భూమిని 2009లో చిన్న కొడుకు ఆర్ఓఆర్‌లో బదిలీ చేయించుకున్నాడు. మా మామగారి స్వార్జితమైన మొత్తం 25 ఎకరాల భూమిలో, హైదరాబాద్‌లోని ప్లాటులో నా భార్యకు వాటా ఉంటుందా? లేదా? మాకు తెలిసిన లాయరు ఒకరు 50-బి ప్రకారం కొన్న భూమిలో కూతుళ్లకు హక్కు ఉండదని చెప్పాడు. ఇది ఎంత వరకు నిజం? నా సమస్యకు సరియైన పరిష్కారం తెలియచేయండి.
- ఎన్ ప్రభాకర్, నిజామాబాద్

మీ మామగారి వద్ద మీరు మీ బంగారాన్ని ఉంచినట్లుగా గానీ, లేదా మీ మామ గారికి తాకట్టు బంగారం తాలూకు డబ్బులు చెల్లించినట్లుగా గానీ, మీ వద్ద లిఖితపూర్వకమైన ఏ ఆధారమూ లేదని రాశారు. ఆ ఆధారమేదీ లేకపోయినా, మీరు మీ మామగారికి ఎవరి సమక్షంలో ఆ డబ్బు చెల్లించారో ఆ వ్యక్తి సాక్ష్యం ఉంటే సరిపోతుంది. లేదా మీ బంగారాన్ని తాకట్టుపెట్టుకున్న వ్యక్తి ద్వారా మౌఖికంగానే అయినా, సాక్ష్యం ఇప్పించినా మీ మామ గారి వద్దనున్న మీ బంగారాన్ని తిరిగి పొందే అవకాశం ఉండేది. కాకపోతే బతికి ఉన్నప్పుడే అదంతా చేయవలసింది. మీ మామ గారు చనిపోయి ఇప్పటికి ఆరే ళ్లకన్నా ఎక్కువ సమయం మించినందున, మీ మామగారి వద్ద మీరు పెట్టిన బంగారాన్ని తిరిగిపొందడం అనేది, కాస్త కష్టమైన పనే. పైగా మీ అత్తగారు కూడా 2009లోనే చనిపోయినట్లుగా తెలియచేశారు. అందువల్ల మీరు మీ బంగారం విషయమై, మీ బావమరుదులతో పోరాడినా లాభం ఉండకపోవచ్చు. ఇకపోతే మీ మామగారి స్వార్జితమైన స్థిరాస్తులు, అవి వ్యవసాయ భూములైనా లేదా హైదరాబాద్‌లోని ప్లాట్ అయినా, ఆయన వీలునామా రాయకుండా చనిపోయిన ట్లయితే, ప్రస్తుతం సవరించి సక్సెషన్ యాక్ట్ ప్రకారంగా, తండ్రిగారి ఆస్తిలో కూతుళ్లకు కూడా, సమాన హక్కు లభిస్తుంది.

మీ భార్యకు ఒక కూతురుగా తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసిన వాటాను ఇవ్వకుండా కేవలం, కుమారులే వారికి వారుగా బదిలీ చేయించుకుని ఆర్ఓఆర్‌లో ఎంట్రీ చేసుకున్నంత మాత్రాన వారికి యాజమాన్యపు హక్కులు సంక్రమించవు. అందువల్ల మీ బావ మర్దులు ఆర్ఓఆర్ ద్వారా బదిలీ చేయించుకున్న విషయాన్ని ప్రశ్నిస్తూ, ఈ ఆస్తులు ఏ న్యాయస్థానం పరిధిలో ఉన్నాయో, ఆ న్యాయస్థానంలో పార్టీషన్‌కై మీ భార్య ద్వారా దావా వేసినట్లయితే, మీకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. ఒక న్యాయవాది ఎవరో, 50-బి ద్వారా మీ అత్తగారు సంపాదించిన ఆస్తిలో కూతుళ్లకు వాటా ఉండదని చెప్పినట్లుగా తెలియచేశారు. నిజానికి 50-బి అనేది తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయ భూమిని కొనడానికి రెవెన్యూ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకునే వెసులుబాటు,. 50-బి అనేది, కేవలం రెవెన్యూ అధికారులు ఇచ్చే పర్మిషన్ మాత్రమే.

50-బి పర్మిషన్ ఉన్నప్పటికి ఆమె వీలునామా రాయకుండానే చనిపోయి ఉంటే, మీ భార్యకు ఆమె అన్నదమ్ములతో సమాన వాటా లభిస్తుంది. మీరు వ్యవసాయ భూమి, ప్లాట్, వీటిలో ఏదో ఒకటి ఏ కోర్టు పరిధిలో ఉన్నాయో తెలుసుకుని, మిగతా ఆస్తులు ఆ కోర్టు పరిధిలో లేకపోయినా, మీరు పార్టీషన్‌కై దావా వేయవచ్చు. మీరు ఏదో ఒక ఆస్తి ఉన్న మీకు సౌకర్యంగా ఉన్న న్యాయస్థానాన్ని ఎంచుకుని, దావా వేయడానికి చట్టంలో పూర్తి వెసులుబాటు ఉంది. అలా దావా వేయడం ద్వారా భార్య తన వాటాను పొందవచ్చు. - వొడ్నాల శ్రీహరి

వొడ్నాల శ్రీహరి
న్యాయవాది, హైదరాబాద్
Courtesy-Andhrajyothy

No comments:

Post a Comment