Monday, 9 December 2013

అవయవదానం

చనిపోయిన వాళ్లు మళ్లీ బతుకుతారా? పునర్జన్మ నిజంగా ఉందా? మనుషులకు లేదు కాని అవయవాలకు ఉంది. బతికున్నప్పుడే అవయవదానానికి అంగీకరిస్తే.. ప్రాణం పోయాక కూడా మరొకరిలో ప్రాణం పోసుకోవచ్చు. అంతటి మహత్కార్యాన్ని భుజాన వేసుకుంది నిమ్స్‌లోని జీవన్‌దాన్ కేంద్రం...
పునర్జన్మ ఉందో లేదో మనకు తెలీదు. కాని అవయవదానం చేస్తే మరొకరికి మాత్రం పునర్జన్మ తప్పక లభిస్తుంది. కన్నతల్లిదండ్రులను జన్మనిచ్చిన వాళ్లు అంటాం. పునర్జన్మను ఇచ్చిన వాళ్లనైతే ఏమనాలి? దేవుళ్లు అనాలి. ఆయువు పోయాక మట్టిలో కలిసిపోయే బదులు.. పోతూ పోతూ మరొకరికి పునర్జన్మను ప్రసాదించి వెళ్లిపోతే - జీవితానికి అంతకంటే సార్థకత మరేముంటుంది? ఒక్కసారి హైదరాబాద్‌లోని నిమ్స్‌లోనున్న 'జీవన్‌దాన్'కు వెళితే ఆ భావనే స్ఫురిస్తుంది. గోదానం, భూదానం, వస్త్రదానం, అన్నదానం ఇవన్నీ పూర్వం నుంచి వస్తున్న దానాలు. కష్టంలో ఉన్న తోటి మనిషిని ఆదుకోవాలన్న అంతస్సూత్రంతో పుట్టుకొచ్చిన సంప్రదాయ సంస్కృతులివి. ఇప్పుడు ఆ దానాలన్నిటి కన్నా మహా దానం అవయవదానం. జీవన్మృతులకు వరం.
అవయవాల అక్రమ విక్రయాన్ని అరికట్టాలన్న ఉద్దేశంతో పుట్టుకొచ్చింది జీవన్‌దాన్. ఇప్పటికీ సామాన్యులకు దీని గురించి పెద్దగా తెలియదు. అవసరమొచ్చినప్పుడు వైద్యులు చెబితే తప్పించి అవగాహన లేదు. అయితే ఈ మధ్యనే జీవన్‌దాన్ ద్వారా తొలి గుండెమార్పిడి విజయవంతం కావడంతో ఇది అందరి దృష్టినీ ఆకర్షించింది. "మాది ఎటువంటి లాభాపేక్ష లేని ప్రభుత్వ సంస్థ. అవయవాలు కావాల్సిన వ్యక్తికి, అవయవదానం చేస్తున్న వ్యక్తికీ అనుసంధానకర్తలము మేము. మన దగ్గర ఇప్పటి వరకు రెండు రకాల అవయవదానాలు ఉన్నాయి. ఒకటి- బతికుండగానే అవయవదానం చేయడం. రెండు- బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తుల (కుటుంబ సభ్యుల అనుమతితోనే) నుంచి తీసిన అవయవాలను ఇతరులకు అమర్చడం. మా సంస్థ రెండో దాని కోసమే పనిచేస్తోంది'' అన్నారు జీవన్‌దాన్ సహాయకురాలు శైలజ. రోడ్డు ప్రమాదాల వల్ల, ఇతరత్రా సంఘటనల వల్ల తీవ్రగాయాలైన వారు.. కొన్ని సందర్భాల్లో బతకడం కష్టం. వైద్యులు ఆఖరి ప్రయత్నం చేసినా బ్రెయిన్‌డెడ్ అవుతారు. అంటే మెదడు తప్ప మిగిలిన అవయవాలన్నీ బాగుంటాయి. ఆ మనిషి బతికే అవకాశమే లేదు కనక ఆ అవయవాలను తీసి.. అవసరమైన వారికి శస్త్రచికిత్సల ద్వారా అమర్చవచ్చు. ఈ మొత్తం ప్రక్రియకూ సహాయపడుతుంది జీవన్‌దాన్.
ముందు వచ్చిన వారికి....
అవయవాల కోసం ప్రైవేటు ఆస్పత్రులు జీవన్‌దాన్‌లో రిజిస్ట్రర్ కావాలి. అప్పుడే అందులోని పేషెంట్లకు జీవన్‌దాన్‌లో అవయవాల్ని అందించేందుకు వీలవుతుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇరవై ఆరు ఆస్పత్రులు సభ్యత్వం తీసుకున్నాయి. బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలను ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మీద అందిస్తారు. ఒక్కోసారి పేషెంట్ అత్యవసర పరిస్థితిని కూడా పరిగణలోనికి తీసుకునే అవకాశం ఉంది. "ఇందుకొక కమిటీ ఉంటుంది. దీనికి ఛైర్మన్ జిల్లా వైద్యాధికారి, సహ ఛైర్మన్ నిమ్స్ డైరెక్టర్, రిజిస్టర్ అయిన ఆస్పత్రులు సభ్యులుగా ఉంటాయి. అవయవదానం, అవయవ మార్పిడి ఈ రెండూ పారదర్శకంగానే జరుగుతాయి. అయితే మార్పిడి చేసుకున్నవారు, ఇచ్చిన దాతల వివరాలను మాత్రం రహస్యంగానే ఉంచుతారు వైద్యులు. లేకపోతే కొన్ని సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది'' అంటున్నారు జీవన్‌దాన్ ఇంఛార్జి డాక్టర్ జి.స్వర్ణలత.
దుఃఖంలోనూ ఒప్పించి...
ఇదివరకైతే అవయవదానం కోసం ముందుకొచ్చే వారే కాదు. దీనికి కారణం మతపరమైన విశ్వాసాలు, సెంటిమెంట్లు. బ్రెయిన్‌డెడ్ కావడం అంటే మనిషి ప్రాణం దక్కదనే అర్థం. ఈ విషయాన్ని వైద్యులు బాధితుడి కుటుంబసభ్యులకు తెలియజేస్తారు. ఫలానా పేషెంటు బ్రెయిన్‌డెడ్ అయ్యాడన్న సంగతి తెలుసుకున్న వెంటనే జీవన్‌దాన్ సభ్యులు అక్కడికి వెళతారు. కుటుంబ సభ్యులను ఓదారుస్తూనే, అవయవదానం గురించి అవగాహన కల్పిస్తారు. "సంబంధిత వ్యక్తి ఎలాగూ బతకడు. మీరు ఒప్పుకుంటే ఆ వ్యక్తి అవయవాలను తీసి మరొకరికి అమరుస్తారు. కనీసం తొమ్మిది మందికి ప్రాణదానం చేసినవారు అవుతారు. ప్రాణం పూర్తిగా పోతే వాటిల్లో ఏదీ పనికిరాదు. ఆలోచించండి'' అని నచ్చజెబుతారు జీవన్‌దాన్ సభ్యులు. అందుకు అంగీకరిస్తే ఆ సమాచారాన్ని వైద్యులకు తెలియజేశాక.. అవయవ మార్పిడి ప్రక్రియ జరుగుతుంది. "ఒకరిది ప్రాణం పోతున్న పరిస్థితి. మరొకరిది పోయే ఆ ప్రాణం మీద ఆధారపడి ప్రాణం నిలుపుకోవాల్సిన పరిస్థితి. వీరిద్దరి మధ్య చాలా సున్నితంగా వ్యవహరించాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. అందుకే అవయవదాతల కుటుంబీకులకు గ్రీఫ్ కౌన్సెలింగ్ ఇస్తాం. దీనికి సైకాలజీ తెలుసుండాలి..'' అంటున్నారు ఉద్యోగులు.
వారికి పునర్జన్మ..
జీవన్‌దాన్ కింద ఈ ఏడాది ఇప్పటి వరకు- మొత్తం 36 మంది అవయవదానం చేశారు. వారి నుంచి 161 అవయవాలను తీసి ఇతరులకు అమర్చినట్లు కేంద్రం పేర్కొంది. ఇందులో మూత్రపిండాలు, కాలేయం, గుండె రక్తనాళాలు, ఊపిరితిత్తులు ఉన్నాయి. ఈ మధ్యనే తొలి గుండెమార్పిడి కూడా జరిగింది. జీవన్‌దాన్ కో ఆర్డినేటర్ల కౌన్సెలింగ్ వల్ల మెల్లమెల్లగా అవయవదానం కోసం ఎక్కువమంది ముందుకొస్తున్నారు. మెదక్‌కు చెందిన బాలయ్య అపార్ట్‌మెంట్ వాచ్‌మ్యాన్. వయసు ముప్పయి నాలుగేళ్లు. కిందపడి తలకు బలమైన గాయమైతే వైద్యం కోసం నిమ్స్‌కు తీసుకొచ్చారు. అయినా ఫలితం లేదు. బ్రెయిన్‌డెడ్ అయినట్లు ప్రకటించారు వైద్యులు. ఆయన భార్యకు, ఇద్దరు కూతుళ్లకు జీవన్‌దాన్ సభ్యులు అవగాహన కల్పించారు. "ఆ పేషెంట్ నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, రెండు గుండె కవాటాలు తీసుకుని.. ఇతరులకు మార్పిడి చేశారు వైద్యులు'' అని చెప్పారు సభ్యులు. మహబూబ్‌నగర్ జిల్లాలోని నారాయణపేటకు చెందిన ఇరవై రెండేళ్ల సంగీత తండ్రితో కలిసి మోటారుబైక్ మీద వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా కిందపడింది. తలకు బలమైన గాయమవ్వడంతో నిమ్స్‌కు తీసుకొచ్చారు కుటుంబసభ్యులు. చికిత్స చేసినా ప్రాణం దక్కలేదు. బ్రెయిన్‌డెడ్ కావడంతో.. అవయవదానం కోసం కుటుంబీకులను ఒప్పించారు. ఆమె శరీరం నుంచి తీసుకున్న ఏడు అవయవాలను ఏడుగురికి అమర్చారు.
కరీంనగర్ జిల్లా తిరుమలాపురానికి చెందిన మరో వ్యక్తి నుంచి కూడా ఏడు అవయవాలను తీసుకుని.. పలువురికి ప్రాణం పోశారు వైద్యులు. "మన దగ్గర మరింత చైతన్యం రావాలి. అభివృద్ధి చెందిన దేశాల్లో అయితే.. ప్రతి వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ వెనుక ఆర్గాన్‌డొనేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. అందులో అందుకు అంగీకరించినట్లు ఉంటే.. ఆ వ్యక్తి దురదృష్టవశాత్తూ ప్రమాదానికి లోనై బ్రెయిన్‌డెడ్ అయితే.. అవయవాలను తీసుకుంటారు వైద్యులు. ఆర్గాన్స్‌ను తీసుకోవడానికి సమయమే కీలకమైనది. మనిషి పూర్తిగా చనిపోయాక తీసుకునే వీలుండదు..'' అంటున్నారు శైలజ. ఇంఛార్జి వైద్యురాలు స్వర్ణలత మాట్లాడుతూ "ఇందులో ప్రపంచానికే ఆదర్శం స్పెయిన్ దేశం. అవయవదానం మీద వారికున్న అంకితభావం మరొకరికి లేదు. మన దేశంలో తమిళనాడు ఆదర్శంగా నిలుస్తోంది. యాక్సిడెంట్స్ అవుతూనే పోలీసులకు ఎలా సమాచారం వెళ్లిపోతుందో.. జీవన్‌దాన్‌లాంటి అవయవదాన సంస్థలకు కూడా ఆ సమాచారం వెళ్లిపోతుంది. మన దగ్గర ఇంత నెట్‌వర్క్ లేదు. ప్రజల్లో మరింత అవగాహన తీసుకొచ్చేందుకే బ్యాంకులకు, ఐటీ కంపెనీలకు, ప్రైవేటు సంస్థలకు వెళ్లి చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నాం. వైద్యసదస్సుల్లో దీని గురించి ప్రస్తావించి ప్రభుత్వ ప్రాధాన్యాన్ని కోరుతున్నాం'' అని ఆమె చెప్పారు.
అవయవదానం చేయదల్చిన వారు జీవన్‌దాన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలు నమోదు చేసుకున్నాక ఆర్గాన్ డోనర్ కార్డు అందిస్తారు. అది అవయవదానాన్ని సులువు చేస్తుంది.
ప్రస్తుతం అవయయవ మార్పిడి కోసం రెండువేల మందికి పైగా జీవన్‌దాన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దాతలు దొరికినప్పుడే వీరందరికీ పునర్జన్మ!
అవయవదానంలో ప్రపంచానికే ఆదర్శం స్పెయిన్ దేశం. దాని మీద వారికున్న అంకితభావం మరొకరికి లేదు. మన దేశంలో తమిళనాడు ఆదర్శంగా నిలుస్తోంది. యాక్సిడెంట్స్ అవుతూనే పోలీసులకు ఎలా సమాచారం వెళ్లిపోతుందో.. జీవన్‌దాన్‌లాంటి అవయవదాన సంస్థలకు కూడా ఆ సమాచారం అలా వెళ్లిపోతుంది. మన దగ్గర ఇంత నెట్‌వర్క్ లేదు. ప్రజల్లో మరింత అవగాహన తీసుకొచ్చేందుకే బ్యాంకులకు, ఐటీ కంపెనీలకు, ప్రైవేటు సంస్థలకు వెళ్లి చైతన్య సదస్సులు నిర్వహిస్తున్నాం. వైద్యసదస్సుల్లో దీని గురించి ప్రస్తావించి ప్రభుత్వ ప్రాధాన్యాన్ని కోరుతున్నాం
డాక్టర్.జి.స్వర్ణలత, ఇంఛార్జి, జీవన్‌దాన్ కేంద్రం, నిమ్స్, హైదరాబాద్.
ఫోన్: 88850 60093, 98499 66317
- మల్లెంపూటి ఆదినారాయణ
- See more at: Courtesy-Andhrajyothy

No comments:

Post a Comment