Monday, 2 December 2013

స్వార్థజీవిగా కాదు... సంఘజీవిగా బతకాలి

Sakshi | Updated: December 01, 2013 00:22 (IST)
ఆదిమాన వులైన ఆదాము, హవ్వలను ఏదేను తోటలోని ఏ వృక్షఫలాన్నైనా తినండి, కాని మంచి చెడు విచక్షణనిచ్చే వృక్షఫలాలను మాత్రం తినకండని దేవుడు ఆదేశిస్తే దుష్టశక్తి ప్రోద్బలంతో ఆ ఫలాలే వారు కోరుకున్నారు. మనిషి తన మంచిని చెడును తానే నిర్ణయించుకోగలిగిన రోజున తనకోసం తాను జీవించేందుకు ఆరాటపడ్తాడే తప్ప పొరుగువాడి గురించి ఆలోచించడని తెలిసే దేవుడు ఆ ఒక్క ఫలాన్ని నిషేధించాడు. సృష్టిలోని ప్రాణులన్నీ తమకోసమే తాము బతుకుతాయి.

కాని మనిషి అలాంటి అథమ స్థాయిలో జీవించకుండా తనకోసం తాను బతికే స్వార్థజీవిగా కాక, అందరినీ ప్రేమించి పదిమందినీ బతికించే సంఘజీవిగా ఉండాలన్నది దేవుని ఆలోచన. నిషిద్ధ వృక్షఫలాన్ని తిన్న ఆదాము దేవుడూహించినట్టే ఎంత స్వార్థపరుడయ్యాడంటే ‘నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాసంమంటూ భార్య హవ్వను తెగపొగిడిన నోటితోనే, నన్ను పాపంలో పడవేసింది ఈమేనంటూ నిందించి తప్పించుకోబోయాడు. మొదటి తరంలో పరనిందకు మాత్రమే పరిమితమైన స్వార్థం రెండవతరంలో కయీనును ఏకంగా నరహంతకుని చేసింది.

దేవుడు నిషేధించిన వృక్షఫలం ‘స్వార్థం’ అని మానవునికి అర్థమయ్యేలోగా అది వికృత రూపం దాల్చి సమాజాన్నంతా భ్రష్టుపట్టించి దేవుని మహోన్నత సంకల్పాలను నిర్వీర్యం చేసింది. (ఆది 3:12). దేవుని ఆజ్ఞల్లోకెల్లా అత్యంత ప్రధానమైనది ‘నీ దేవుణ్ణి పరిపూర్ణంగా ప్రేమించడం, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించడం’ అని యేసుప్రభువు చెప్పారు (మత్త 22:36-40). దేవుణ్ణి ప్రేమించడానికి పొరుగువాణ్ణి ప్రేమించడంతో లింకు పెట్టిన రెండాజ్ఞల్లాగా కనపడే ఒకే ఆజ్ఞ ఇది: దేవుడు- మనిషి- అతని పొరుగువాడు’ అనే త్రయం మధ్య ఏర్పడవలసిన ప్రేమబంధాన్నే బైబిలు చెబుతుంది. ధూళితో కూడా సమానం కాని మానవుడు నశిస్తే అతన్ని వెదికి రక్షించడానికి పరలోక వైభవాన్ని వదిలి భూలోకానికి తరలి వచ్చిన యేసుక్రీస్తు ప్రేమ లోతుగా అర్థమయ్యే కొద్దీ విశ్వాసికి తన పొరుగువారి ప్రాముఖ్యత మరింతగా అర్థమవుతుంది.

యేసుక్రీస్తు నన్నే కాదు నా పొరుగువాణ్ణికూడా ప్రేమించి ప్రాణం పెట్టాడన్న అత్యున్నత స్థాయి గ్రహింపు విశ్వాసిలో  పరివర్తన తెస్తుంది. యేసు చెప్పిన ఒక ఉపమానంలో గాయాలపాలై కొనప్రాణంతో రోడ్డు పక్కన పడి ఉన్న వ్యక్తిని చూసిన యాజకుడు, లేవీయుడు ‘ఇతనివద్ద నేనాగితే నా దేవాలయ విధులేమవుతాయి?’ అని ఆలోచించి వెళ్లిపోయారు. కాని దేవాలయ ప్రవేశార్హత కూడా లేని సమరయుడు ‘ఇతని వద్ద నేనాగకపోతే దేవునికి నాలాగే ప్రియుడైన ఈ వ్యక్తి ఏమవుతాడు?’అని ఆలోచించి దివ్యమైన పరిచ ర్య చేశాడు.

సాటిమనిషికి సాయం నిరాకరించడానికి దేవుణ్ణే సాకుగా చూపించేది మతం, ఆ వ్యక్తిలో దేవుణ్నే చూసేది దైవత్వం. బట్టలు, నగలు, కానుకల పేరిట మనతో కోట్లాది రూపాయలు ఖర్చు చేయించి వ్యాపార సంస్థల ఖజానా నింపేందుకు మరో క్రిస్మస్ రానే వచ్చింది. ఆ ఖర్చులో ఈసారి కొంతైనా ఆదాచేసి కనీసం ఒక పేద కుటుంబాన్ని మనం ఆదుకోగలిగితే ఈ క్రిస్మస్ నిజంగా ఆనందదాయకం, అర్థవంతం కాదా! ఆలోచించండి.

  - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్

 హితవాక్యం: మీ శత్రువులను, పొరుగువారిని ప్రేమించండని దేవుడు ఆదేశించాడు. ఎందుకంటే చాలాసార్లు ఈ ఇద్దరూ ఒకటే!   
- ఆల్బర్ట్ లిండెల్

No comments:

Post a Comment