Written by Anjaneyulu Pn | Updated: November 21, 2013 23:51 (IST)
ఈ బ్యాచ్‌లో ఎవరో ఒకరు ప్రతిరోజూ మధ్యాహ్నం అయ్యేసరికి నగరంలోని ఒక ప్రముఖ కార్పొరేట్ ఆఫీస్‌కు చేరుకొంటారు. ఆ కంపెనీ తమ ఉద్యోగులకు ప్రొవైడ్ చేసే లంచ్‌లో మిగిలే అన్నాన్ని తీసుకొని పాతబస్తీ పరిసరాల్లోని మురికివాడలకు, అనాథాశ్రమాలకు ఆటోలో చేరుకొంటారు. అక్కడ ఆకలితో బాధపడే పేదవారికి, అనాథలకు ఈ భోజనాన్ని ప్యాకెట్ల రూపంలో అందిస్తారు. ఇదే వీరి దినచర్య. ఈ విధంగా ప్రతిరోజూ కొన్ని వందలమంది ఆకలిని తీరుస్తున్నారు ఈ కుర్రాళ్లు. 2012 మార్చిలో ‘గ్లోటైడ్’ మొదలైంది. దీని రూపకర్త మీర్ ముస్తఫా అలీ హష్మీ.
సౌదీ నుంచి వచ్చిన ఈ ఎన్‌ఆర్‌ఐ కుర్రాడు హైదరాబాద్‌లోని ‘విఫ్’ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. మురికివాడల్లోని ప్రజల జీవనాన్ని చూసి చలించిన హష్మీ.. ఒక వ్యక్తిగా తను వారికోసం ఏం చేయగలనా అని ఆలోచించి ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశాడు. ఇందులో తనకు రీనా పిళ్లై సహకారం అందిస్తున్నారని హష్మీ చెప్పాడు. ‘‘మాకు తెలిసిన ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ ప్రతిరోజూ ఒక స్టార్‌హోటల్ నుంచి తన ఉద్యోగులకు లంచ్ తెప్పిస్తుంది, వారంతా భోంచేయగా చాలా అన్నం మిగులుతుంది.
అందుకే మనసున్న ప్రతి ఒక్కరినీ మాతో చేతులు కలపమని కోరుతున్నాం..’’ అని హష్మీ విజ్ఞప్తి చేస్తున్నాడు. అన్నపు రాసులు ఒక చోట.. ఆకలి మంటలు ఒకచోట... ఈ రెండింటి మధ్య వారధిగా నిలుస్తున్నారు వీరు. కోట్లాది మెతుకులుగా వృథా అవుతున్న ఆహారంలో కొన్ని మెతుకులనైనా సద్వినియోగ పరుస్తున్నారు. కొందరి ఆకలినైనా తీరుస్తున్నారు. మరింత మంది ఆకలిని తీర్చాలని తపిస్తున్నారు. నిధుల రూపంలోనే కాదు... వృథా చేసే ఆహారాన్ని అందించడం ద్వారానైనా తమను ప్రోత్సహించాలని కోరుతున్నారు.
-జీవన్‌రెడ్డి. బి
60 కోట్ల విలువైన ఆహారం మట్టిపాలవుతోంది...
ప్రపంచవ్యాప్తంగా యేడాదికి 130 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. ఎవరికీ దక్కక మట్టిపాలు అవుతోంది. యునెటైడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ చెబుతున్న నిజమిది. ఈ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిలో సగం ఆహారం మటుకు మాత్రమే సద్వినియోగం అవుతోంది. మిగిలినది వృథా అవుతోంది. ప్రపంచం వరకూ ఎందుకు.. మనదేశంలోనే యేటా దాదాపు 60 వేల కోట్ల రూపాయల విలువైన ఆహారం చెత్తకుండీల పాలవుతోంది! ఇక్కడే అనునిత్యం కోట్లాది మంది ఆకలితో అలమటిస్తున్నారు. అటు వృథా, ఇటు కరువూ ఒకే చోట! అందుకే దీన్ని బ్యాలెన్స్ చేయడానికి తమ వంతు ప్రయత్నం చేస్తుంది ‘గ్లో టైడ్’ సంస్థ.
No comments:
Post a Comment