Tuesday, 26 November 2013

మలిసంధ్య వేళలో...సమాజానికి చేతనైనంత సాయం

రిటైర్మెంట్ అనేది చేస్తున్న ఉద్యోగానికి ఉంటుంది కానీ మిగతా పనులకు ఉంటుందా? బుర్రలో ఆలోచనలుండి... ఒంట్లో పనిచేసే సత్తువ ఉండి... సమాజానికి ఏదైనా చేయాలనే తపన ఉంటే దానికి ముసలితనం ఆటంకంగా మారుతుందా? మలిసంధ్య వేళలో... పొద్దుపోకుండా, ఒంటరిగా కూర్చునే బదులు సమాజానికి చేతనైనంత సాయం చేయడంలో విశ్రాంతి, మనశ్శాంతి లభిస్తుందని చాలామంది రుజువు చేస్తున్నారు. 'కొంత మంది యువకులు పుట్టుకతో వృద్ధులు'గా మారుతుంటే... 'కొంత మంది వృద్ధులు కొత్త తరానికి స్ఫూర్తి ప్రదాతలు'గా కనిపిస్తున్నారు. రిటైర్మెంట్ తర్వాత ఊరికే ఇంట్లో కూర్చోకుండా, పనిలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి, అద్భుతాలు సృష్టించిన సీనియర్ సిటిజన్స్ మన చుట్టూ చాలామందే ఉన్నారు. వారిలో కొందరి స్ఫూర్తిగాథలే ఈ వారం కవర్‌స్టోరీ.

అంధులకు అమ్మ
అంధులు... అందునా అనాథలు. అయినోళ్లు వదిలించుకుని రోడ్డున పడేస్తే... వారి చేయిపట్టి వెలుగుబాట వైపు నడిపించేందుకు నడుం బిగించిందో 75 ఏళ్ల మహిళ. మూడు దశాబ్దాలుగా తనకు కనిపించిన అంధులనల్లా అక్కున చేర్చుకుని కడుపు నింపుతోంది.అమ్మలా ఒళ్లో కూర్చోబెట్టుకుని, అక్షరాలు దిద్దించి ఉపాధి చూపిస్తోంది.. ఆ మహిళామూర్తి పేరు రోశమ్మ. ఆమె స్థాపించిన విద్యాలయం పేరు విశ్వభారతి అంధుల పాఠశాల. నెల్లూరులో ఉంది ఇది.

"మేం ఇంటికెళ్లం.. ఇక్కడే ఉంటాం. పెద్దమ్మ మమ్మల్ని బాగా చూసుకుంటోంది. బాగా చదువుకుని ఉద్యోగం సంపాదిస్తాం'' అని చెపుతారు ఈ పాఠశాల పిల్లలు. తొమ్మిది నెలల పాపాయిగా ఈ పాఠశాలలో చేరిన 12 ఏళ్ల సాయి మొదలుకుని 30 ఏళ్ల పైబడ్డ సుబ్రహ్మణ్యం వరకు అందరూ ఓ కుటుంబంలా మెలుగుతారు. తమ వైకల్యాన్ని వెక్కిరించేవారి ఎగతాళి మాటల్ని వారు లెక్కచేయరు. బాధపడరు. ఎందుకంటే విశ్వభారతి పాఠశాల వారికి పట్టుదల నూరిపోసింది. ఆత్మస్థయిర్యం అంటే ఎలా ఉంటుందో రుచి చూపింది.

ఒక ఆలోచన.. మరో చిన్న సంఘర్షణ.. ఏదో ఒకటి చాలు జీవితాన్ని మార్చేయడానికి. విశ్వభారతి స్కూలు పుట్టుక కూడా అంతే. ఈ పాఠశాల వ్యవస్థాపకురాలు...రాపూరు మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన రోశమ్మ ఒకప్పుడు నర్సుగా పని చేసేది. తన మామగారు వీరారెడ్డి పేద వారికి సాయ పడటం చూసి తానూ అదే బాటలో నడవాలనుకుంది. దురదృష్టవశాత్తు భర్త అనారోగ్యంతో మంచాన పడ్డాడు. ఎన్ని సేవలందించినా ఫలితం లేకపోయింది. రోశమ్మ ఒంటరైంది. ఆ క్షణాన ఆమెలో ఎంతో సంఘర్షణ. 1969లో ఢిల్లీలో ఉన్న తన కూతుర్ని చూడటానికి వెళ్లిన రోశమ్మ అక్కడ ట్రాఫిక్‌లో ఓ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయింది. అదేంటంటే.. రోడ్డు దాటుతున్న ఓ అంధుడు చేతిలో ఉన్న కర్ర చూపగానే వాహనాలన్నీ ఎక్కడివక్కడే ఆగిపోయాయి. అతనితో మాట కలిపింది రోశమ్మ. తాను ఎంఏ చదువుతున్నట్లు చెప్పాడా వ్యక్తి. అప్పటి దాకా తెలియదామెకు...అంధులకు ఒక ప్రత్యేక లిపి ఉన్న సంగతి. తానూ ఓ పాఠశాల ప్రారంభించి అంధులకు విద్య నేర్పించాలని ఆ క్షణాన్నే నిర్ణయించుకుంది. అదే విశ్వభారతి స్థాపనకు నాంది.

స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో 1974లో ఓ పూరి గుడిసెలో పాఠశాలను ఏర్పాటు చేసింది. కానీ...రెండేళ్లు తిరక్కుండానే అగ్ని ప్రమాదంలో ఆ గుడిసె కాలిపోయింది. ప్రజా ప్రతినిధులు, అధికారులు సానుకూలంగా స్పందించి 1976లో పక్కా భవన నిర్మాణానికి అనుమతిచ్చారు. మాగుంట సుబ్బరామిరెడ్డి, పెళ్లకూరు రామచంద్రారెడ్డి తదితర దాతలు కూడా ముందుకు వచ్చి మరిన్ని భవనాలను ఏర్పాటు చేశారు. ఈ రోజు అక్కడ 70 మంది అంధ బాలలు ఉన్నారు.

ఇక్కడ విద్యార్థులకు అన్న వస్త్రాలు, వసతి సౌకర్యాలు అన్నీ ఉచితమే. బాల బాలికల కోసం ప్రత్యేకమైన గదులు, భోజనశాల, క్రీడా మైదానం అన్నీ సమకూరాయి. ఇక్కడ చదువుకుని స్థిరపడిన వారికి వివాహాలు కూడా చేశారామె. రాష్ట్రవ్యాప్తంగా ఎందరో అంధులు ఈ గూటికొచ్చి చేరుతున్నారు. రోశమ్మ కుమార్తె ప్రభావతి, అల్లుడు కూడా ఇక్కడే ఉంటూ తమ సేవలందిస్తున్నారు. ప్రభావతి స్వయంగా బ్రెయిలీ లిపి నేర్చుకుని విద్యార్థులకు బోధిస్తోంది. ఇక్కడ పదో తరగతి, ఇంటర్ చదివిన ప్రతి విద్యార్థి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులవడం గమనార్హం. విశ్వభారతి విద్యార్థుల్లో 50 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.

"మేం మా పాఠశాలోనే ఉపాధి కల్పన కార్యాలయాన్ని ఏర్పాటు చేశాం. ఇక్కడ చదువుకున్న వారి వివరాలు నమోదు చేసుకుని తగిన ఉద్యోగ అవకాశం వచ్చినప్పుడు వారికి సమాచారం అందించి మేమే స్వయంగా దరఖాస్తులు పంపుతాం. ఆశయాలు అందరికీ ఉంటాయి. కానీ ఆశయ సాధనలో ఎదురయ్యే కష్టనష్టాలకోర్చి వాటిని బతికించుకునే గట్టి సంకల్పం మాత్రం కొందరికే ఉంటుంది. ఆ సంకల్ప బలమే మూడు దశాబ్దాలుగా విశ్వభారతి పాఠశాలను నడిపిస్తోంది. అంధుల జీవితాల్లో వెలుగు నింపుతోంది'' అంటోంది రోశమ్మ.

'సాలిడ్' సంకల్పం
రోడ్ల పక్కన ఎక్కడ చూసినా చెత్త... గుట్టలు గుట్టలుగా, ఈగలు దోమలు వాలుతూ.... పందులు తిరుగుతూ... కంపు కొడుతూ... ప్రజలను అనారోగ్యానికి గురిచేసే ఈ ప్రత్యక్ష నరకాన్ని అల్మిత్రా పటేల్ కూడా అనుభవించింది. వీటి గురించి మున్సిపాలిటీకి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం కనిపించలేదు. నగరంలోని కాలనీల నుంచి సేకరించిన మున్సిపాలిటీ చెత్తను హైవే పక్కన గుట్టలు గుట్టలుగా బహిరంగంగానే పారేస్తున్నారు. వాటి నుంచి ముక్కుపుటాలదిరే దుర్గంధం... సమీప కాలనీల్లో ఉండే ప్రజలు ఆ విషవాయువులను పీల్చి రోగాల బారిన పడ్డారు.

ఇక లాభం లేదు... ఏదో ఒకటి చేయాల్సిందే అని నిర్ణయించుకున్న అల్మిత్రా పటేల్ 1996లో సుప్రీంకోర్టులో 'పిల్' వేసింది. ఆమె పోరాట ఫలితంగా దేశంలోనే మొదటిసారిగా 'మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ రూల్స్ 2000'ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. పటేల్ అక్కడితోనే ఆగిపోలేదు. ఇప్పటికీ ఆమె చెత్తపై అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది. పటేల్ సాధారణ గృహిణి కాదు. మస్సాచ్యూసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివిన తొలి భారతీయ మహిళ. ఉన్నత విద్యావంతురాలైన ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలతో 1972లో బెంగళూరు శివార్లలోని కొతనూర్‌లో నివాసం ఏర్పరచుకుంది.

అప్పట్లో ఆ ప్రాంతం ప్రశాంతంగా ఉండేది. 1990 తర్వాత నగరాభివృద్ధి వేగవంతం కావడంతో సిటీలోని చెత్తను లారీల్లో తీసుకొచ్చి కొతనూర్ పరిసర ప్రాంతాల్లో బహిరంగంగా డంప్ చేసేవారు. ఈ విషయం గురించి పటేల్ సంబంధిత అధికారులకు ఎన్నో ఉత్తరాలు రాసింది. అయినా కూడా ఎవరూ పట్టించుకోలేదు. ఆరోగ్య ఉన్నతాధికారి ఒకరైతే ఆమెను విసుక్కోవడమేగాక, ఆగ్రహాన్ని ప్రదర్శించాడు. "ఈ సంఘటనతో నా రక్తం ఉడికింది. నాలో పర్యావరణ చైతన్యం మొదలైంది'' అని చెప్పింది పటేల్.

పటేల్ చేస్తున్న కృషి దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. ఇంత సుదీర్ఘ కాలంలో ఆమె 'వేస్ట్ మేనేజ్‌మెంట్'పై అనేక పరిశోధనలు చేయడమేగాక, అనుభవపూర్వకంగా చాలా విషయాలు తెలుసుకుంది. ప్రస్తుతం దేశంలోని మున్సిపాలిటీలు ఆచరిస్తున్న వేస్ట్ మేనేజ్‌మెంట్ మెళకువలన్నీ ఈ వృద్ధురాలు రూపొందించినవే కావడం విశేషం. "అప్పట్లో సుప్రీం కోర్టు నన్ను అర్బన్ సాలిడ్ వేస్ట్ పాలసీ రూపకల్పనకు సంబంధించిన కమిటీలో ఒక సభ్యురాలిగా నియమించింది. అందులో భాగంగా నేను పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు దాదాపుగా 300 సలహాలు, సూచనలు అందించాను.

వాటన్నింటి మేళవింపుగానే ప్రస్తుతం ఇళ్ల నుంచి మున్సిపాలిటీలు చెత్తను సేకరిస్తున్నాయి'' అని పటేల్ విజయదరహాసాన్ని చిందించింది. పారిశుద్ధ్యం ప్రాముఖ్యతను వివరిస్తూ పటేల్ బెంగళూరు నుంచి ఢిల్లీదాకా 30 నగరాలు తిరిగి, అనేక మంది అధికారులను కలిసి ఎన్నో సలహాలు, సూచనలు అందించింది. ప్లాస్టిక్ నుంచి ఈ భూమిని కాపాడాలని పిలుపునిస్తోంది. 70 ఏళ్ల వయసులో కూడా కొత్త కొత్త ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌ను ఉపయోగిస్తూ దేశ, విదేశాల్లో పారిశుద్ధ్య అవగాహనను కల్పిస్తోంది.

సమాచార వారధి
"మనిషి జన్మ అత్యుత్తమమైనది. మనిషిగా పుట్టినందుకు ఎదుటివారికి, సమాజానికి తప్పకుండా సాయం చేయాలి. ఊరికే కూర్చోకుండా ఓ ముసలాయనను రోడ్డు దాటించడమో, చెట్లకు నీళ్లు పోయడమో ఏదో ఒకటి చేయాలి. సాయం చేయడానికి చిన్నోడు, ముసలోడు అనే తేడా ఉండకూడదు. అందుకు ధనవంతులే కానక్కర్లేదు. సాయం చేయాలనే కోరిక ఉండి, దానిని ఆచరణలో పెడితే చాలు'' చిన్నతనంలో తల్లి చెప్పిన మాటలు కళ్యాణ సుందరంలో బాగా నాటుకుపోయాయి. ఇప్పుడాయనకు 72 ఏళ్ళు. తెల్లటి గడ్డం, తెల్లటి దుస్తులతో, ముఖంపై ఎప్పుడూ చెరగని చిరునవ్వుతో కనిపించే కళ్యాణ సుందరానికి చెన్నైలోని అడయారులో 10 అడుగుల చిన్న ఆఫీసు గది ఉంది. ఈ గది నుంచే ఆయన అందరికీ 'సమాచార సేవ' చేయాలని చూస్తున్నారు. దానికొక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నాడు.

ప్రస్తుతం అనాథల కోసం 'అన్బుపాలం' అనే ఆర్గనైజేషన్‌ను నడుపుతున్న ఈ ముసలాయన తమిళంలో ఆన్‌లైన్ సమాచారాన్ని అందించే పని మొదలు పెట్టాడు. దీనిని ఆయన లైబ్రరీ అంటున్నాడు. చాలామంది తమిళులు ఆన్‌లైన్‌లోని ఇంగ్లీషు సమాచారంతో ఇబ్బంది పడుతున్నారు. వారి కోసం తమిళంలోనే వివిధ సమాచార సేవలను అందించాలనేది ఆయన సంకల్పం. దీనిని తమిళ భాషను అంతర్జాలంలో కూడా బతికించుకోవడానికి తనకు దొరికిన గొప్ప అవకాశంగా కళ్యాణ సుందరం భావిస్తున్నాడు.

కూరగాయల ధరల నుంచి స్టాక్‌మార్కెట్ దాకా... పాస్‌పోర్టు అప్లికేషన్ల నుంచి విద్యార్థులకు అవసరమైన విద్య, ఉద్యోగ, ఉపాధి వార్తల దాకా... అన్నింటిని తమిళభాషలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రాజెక్టు కోసం ఆయన గత ఏడేళ్లుగా కృషి చేస్తున్నాడు. అన్ని పనులు కొలిక్కి వచ్చాయని, ప్రభుత్వ అనుమతులు కూడా వచ్చేస్తే వచ్చే యేడాది తన సేవలు ప్రారంభమవుతాయని చెప్పాడు. చెన్నైలోని తిరునేల్‌వెళి అనే కుగ్రామంలో జన్మించిన కళ్యాణ సుందరం చదువుకునేందుకు రోజూ పది కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లేవాడు. ఎలాంటి సమాచారం అందుబాటులో ఉండేదికాదు. ఈ అనుభవంతోనే అందరికీ సమాచారం అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచన ఆయన మదిలో మెదిలింది. ఉన్నత కుటుంబంలో పుట్టిన సుందరానికి చిన్నప్పటి నుంచే సేవాదృక్పథం ఉండేది. తన తోటి పిల్లలకు స్కూలు ఫీజులను పాకెట్ మనీ నుంచి కట్టేవాడు. అదే దృక్పథాన్ని కొనసాగిస్తూ 72 ఏళ్ల ముదిమి వయసులో ఈ బృహత్ పథకానికి శ్రీకారం చుట్టాడు.

బ్లాక్ మార్కెట్‌ను హడలెత్తించిన 'బ్లాగ్'
భారత సైన్యంలో హవల్దార్‌గా సేవలందించిన ఆర్మీమాన్ ఎస్. చంద్రశేఖరన్ నాయర్ రిటైర్మెంట్ తర్వాత విశ్రాంత జీవనాన్ని గడపాలి. ఆయనకు మాతృభాష మలయాళంతో పాటు హిందీ కూడా వచ్చు. కానీ కంప్యూటర్ ఈ ముసలాయనను ఆకట్టుకుంది. కంప్యూటర్ నాలెడ్జ్ పెంచుకోవాలంటే ఇంగ్లీషు తప్పనిసరి. పదవ తరగతి మాత్రమే చదువుకున్న నాయర్ ఏ మాత్రం సిగ్గుపడకుండా తన కూతురు, కోడళ్ల సాయాన్ని అర్థించాడు. వారి సహకారంతో అంతర్జాలంలోకి అడుగుపెట్టాడు. కేరళలోని రబ్బరు తోటల గురించి స్టడీ చేసి (గతంలో వీరికి కూడా రబ్బరు తోటలుండేవి), ఆర్టీఐ యాక్ట్‌ను ఉపయోగించి కావాల్సినంత సమాచారాన్ని సేకరించాడు. నెమ్మదిగా రబ్బరు తోటల పెంపకం,ట్రేడింగ్ మీద జియోసిటీస్ ఆఫ్ యాహూకు వ్యాసాలు పంపే స్థాయిని సంపాదించాడు.

2008లో ఆయన సొంతంగా కేరళ ఫార్మర్స్ ఆన్‌లైన్. కామ్ బ్లాగ్‌ను ప్రారంభించాడు. ఈ బ్లాగ్‌లో ఆయన రబ్బర్ ప్రొడక్షన్, ఎగుమతులు, ధరలు తదితర అంశాలపై సమాచారాన్ని ఇవ్వడం ప్రారంభించాడు. నెలల వ్యవధిలోనే ఈ బ్లాగ్ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. రబ్బరు తోటల రైతులను దోచుకుంటున్న దళారుల ఆట కట్టించేందుకు ఆయన ఇందులో జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్న ధరలను కూడా పెట్టేవాడు. క్రమక్రమంగా దేశవ్యాప్తంగా ఉన్న రబ్బరు తోటల రైతులు, ట్రేడర్లతో పాటు పరిశోధకులు కూడా ఈ బ్లాగ్‌కు అభిమానులుగా మారారు. చివరికి రబ్బరు బోర్డు కూడా ఈ బ్లాగ్‌లోని అంశాలను పరిశీలించి ఆచరణలో పెట్టేది. ఆ విధంగా అప్పటిదాకా ఈ రంగంలో ఉన్న బ్లాక్ మార్కెటింగ్, అవినీతికి నాయర్ చెక్ పెట్టాడు.

బ్లాగింగ్ క్యాంపెయిన్ ద్వారా అందర్నీ చైతన్యవంతుల్ని చేసిన నాయర్ 2009లో మరో అడుగు ముందుకేసి 'క్వాలిటీ రబ్బర్ మార్కెటింగ్ సొసైటీ' (క్యూఆర్ఎంఎస్)ని ఏర్పాటుచేశాడు. రబ్బర్ ట్రేడింగ్‌లోని అవలక్షణాలను నిర్మూలించి రైతులకు మేలు చేయాలన్నదే ఈ సొసైటీ లక్ష్యం. ఈ మిషన్‌కు చాలామంది రైతులు, ఆర్థిక నిపుణులు, పరిశోధకులు అండగా నిలిచారు. "ఒక బ్లాగ్, ఆర్టీఐ చట్టం ద్వారా ఈ రంగంలోని అవినీతిని అరికట్టగలిగాను. ఇప్పుడిక క్యూఆర్ఎంఎస్ సేవలను మరింత విస్తరించాలనే ఆలోచనలో ఉన్నాను. దీనికి కూడా అందరి సహకారం ఉంటుందనే ఆశతో ముందుకు అడుగులేస్తున్నాను'' అంటున్న ఈ వృద్ధుడు అనుకున్నది సాధించేదాకా విశ్రమించడని ఆయన పనులు చూస్తేనే తెలుస్తుంది.

అరవై ఏళ్లు నిండిన తర్వాత జీవితంలో ఏముంటుందనే నిరాశావాదులే కాదు... అరవై ఏళ్ల తర్వాత కొత్త జీవితం మొదలవుతుందని నిరూపిస్తున్న ఇలాంటి ఆశావాదులు కూడా ఎంతోమంది మన చుట్టూ ఉన్నారు. అద్భుతాలు సృష్టిస్తున్నారు. ముసలితనం అనేది వయసుకే గానీ మనసుకు కాదని, మలి సంధ్య వేళలో కూడా మనసుకు నచ్చిన పని చేసుకుంటూపోతే వృద్ధాప్యం ఆలోచనలు కూడా దరి చేరవని రుజువు చేస్తున్న ఎందరో సీనియర్ సిటిజన్స్ ఈ తరానికి సవాళ్లు విసురుతున్నారు. పట్టుదల అనే చేతికర్ర సాయంతో సక్సెస్‌ఫుల్‌గా ముందుకు సాగిపోతున్నారు.

- నెల్లూరు ఆంధ్రజ్యోతి ప్రతినిధి గయాజుద్దీన్ సహకారంతో...
Courtesy-Andhrajyothy

No comments:

Post a Comment