Sunday, 3 November 2013

కళకళలాడే ప్యాకింగ్...

Sakshi | Updated: November 02, 2013 00:47 (IST)
కళకళలాడే ప్యాకింగ్...
కత్తిరించండి, అతికించండి, ముడివేయండి... కానుకగా ఇవ్వండి.

పండగ పూట బంధుమిత్రులకు కానుకలు ఇవ్వడం వల్ల బంధాలు పదిలం అవుతాయని, రెట్టింపు ఆనందం సొంతమవుతుందని అందరి భావన. అందుకే తమదైన బడ్జెట్‌లో కానుకలు ఇవ్వడానికి ఉత్సాహం చూపుతుంటారు. ఇచ్చే కానుక గ్రాండ్‌గా ఉంటే అందుకునే కళ్లు దీపాలను మరిపిస్తాయి. ఇందుకు భారీ ఖర్చు అనుకొని భయపడాల్సిన పనిలేదు. తక్కువ ఖర్చులోనే కానుకను గ్రాండ్‌గా ఇవ్వచ్చు. పైగా ఆ కానుకకు హృదయపూర్వకమైన స్పర్శను జత చేసి మరీ ఇవ్వచ్చు.

ఇంట్లో చేసిన స్వీట్లు, షాపుల్లో కొనుగోలు చేసిన చాక్లెట్లు, వంటగదిలోకి వస్తువులు, గార్డెన్‌లోకి మొక్కలు, మేకప్ సామాగ్రి, పెర్‌ఫ్యూమ్స్.. ఇలా ఇచ్చే వస్తువు ఏదైనా దానిని అందమైన ప్యాకింగ్ చేయడంలోనే ఉంది అసలైన సృజన. గుండు పిన్ను నుంచి చాక్లెట్ రేపర్‌‌స వరకు గల్లీలోని స్టేషనరీ షాప్ మొదలుకొని, షాపింగ్ మాల్స్ వరకు అన్ని చోట్లా లభిస్తున్నాయి.

 తీపి కానుక...
పండగకు ప్రత్యేకంగా ఇంట్లో స్వీటు, హాటు తయారుచేస్తారు. లడ్డూలు, మురుకులు రంగు కాగితాల్లో చుట్టి, శాటిన్ రిబ్బన్‌తో చుడితే అందమైన కానుక రెడీ అవుతుంది. ఒక్కో కానుకకు 10-20 రూపాయల్లోనే ఖర్చు అవుతుంది. అయితే కాగితాల రంగు తినుబండారాలకు అంటుకోకుండా లోపల సిల్వర్‌ఫాయిల్ చుడితే మంచిది.

 వెలుగులను ముడి వేయచ్చు!

 ఏ తరహా కానుకలను ఇవ్వాలో ముందుగానే ఆలోచించుకోవాలి. ఆ తర్వాత రంగు రంగుల షిమ్మర్ నెటెడ్, బెనారస్, సిల్క్.. మెటీరియల్ మీటర్ లేదా అరమీటర్ తీసుకోండి. కావల్సిన పరిమాణంలో కట్‌చేసుకొని దారంతో చిన్నసంచిని కుట్టండి. దాంట్లో మీకు నచ్చిన లడ్డూ ఇతర మిఠాయిలు లేదా డ్రై ఫ్రూట్స్ పెట్టి ఇవ్వచ్చు. ఇందుకోసం మీటర్ వంద రూపాయల్లోపు ఉన్న మెటీరియల్‌కూడా లభిస్తోంది. మీటర్‌కు పది సంచులవుతాయి. ఆ విధంగా చూస్తే ఒక్కోదానికి పదిరూపాయల ఖరీదు కూడా కాదు. మరింత గ్రాండ్‌గా కావాలనుకుంటే సంచులకు లేసులు, కుందన్స్, చమ్కీలను అతికించి, రిబ్బన్‌తో ముడేస్తే చాలు.

 బుట్టల్లో హంగులు... వెదురు బుట్టలు రకరకాల మోడల్స్‌ను బట్టి రూ.20/- నుంచి మార్కెట్లో లభిస్తున్నాయి. వీటికి రంగులు వేసి, రంగు రంగుల రాళ్లను అతికించి, లేసులు చుట్టాలి. అడుగున నెటెడ్ క్లాత్ పరిచి, మిఠాయిలను పొందిగ్గా అమర్చితే గ్రాండ్ గిఫ్ట్ ప్యాక్ రెడీ!

 సృజనాత్మకత ...
ప్యాకింగ్ కోసం స్టేషనరీలో లభించే కలర్ పేపర్లు, రంగు రంగుల శాటిన్ రిబ్బన్లు, మెరుపు తాళ్లు, వెడల్పాటి అట్టముక్కలు, రంగులు, కుందన్స్, స్టోన్స్... ఇలా ఎవరి కళాత్మక దృష్టిని బట్టి వారు నైపుణ్యంగా ప్యాకింగ్ బాక్స్‌లను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు. 

 ప్యాకింగ్‌లో ప్రధానమైనవి

 పండగ కాబట్టి మిఠాయిలు, ఎదుటివారి అభిరుచికి తగిన వస్తువు, కళాత్మకంగా అనిపించే రెండు ప్రమిదలు, దేవతా ప్రతిమలు ఎంచుకోవాలి.

 ఇచ్చే వస్తువు పెద్దదా, చిన్నదా అని ఆలోచించనక్కర్లేదు.  ఇచ్చే కానుకకు అభినందన పూర్వకమైన చిరునవ్వును కూడా జత చేసి, ఎదుటివారి అభిమానాన్ని చూరగొనచ్చు.
 పండగ ఆనందాన్ని ఏడాదంతా మూటగట్టుకోవచ్చు.
Courtesy-Sakshi

No comments:

Post a Comment