Wednesday, 13 November 2013

నవయువం : లక్ష్యానికి జై!

Sakshi | Updated: November 13, 2013 00:07 (IST)
నవయువం : లక్ష్యానికి జై!

 ‘విద్యార్థిదశలో సరైన మార్గదర్శకత్వం లేక నేను చాలా ఇబ్బందిపడ్డాను. అందుకే కొంతకాలంపాటు విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్పాలనిపించింది’ అంటున్నారు జైపాల్‌రెడ్డి. ఇప్పటివరకు పదకొండువందలకు పైగా పాఠశాలల్లో, కళాశాలల్లో పర్సనాలిటీ డెవలప్‌మెంట్ క్లాసులు చెప్పిన ఈ యువమాస్టారు గురించి...

 ముందు తను కోరుకున్న కంప్యూటర్ డిగ్రీ పూర్తిచేసిన జైపాల్‌రెడ్డికి సైకాలజీ చదవాలనిపించింది. దాంతో ఉద్యోగం సంగతి పక్కన పెట్టి ఎమ్మెస్సీ సైకాలజీ పూర్తిచేశారు. తనకున్న డిగ్రీలతో జర్మనీలో ఉద్యోగ అవకాశం వచ్చినా వదులుకుని వ్యక్తిత్వ వికాస పాఠాలపై దృష్టిపెట్టారు. ‘‘నేను పుట్టి పెరిగింది నిజామాబాద్ జిల్లా అల్లాపూర్ గ్రామం. మాది వ్యవసాయకుటుంబం. అమ్మానాన్నలకు నేను పెద్ద చదువు చదివి ఉద్యోగం చేస్తూ పట్టణంలో స్థిరపడాలని ఉండేది. నేనేమో ఇంటర్ ఫస్టియర్ ఫెయిలై వారిని నిరాశపరిచాను. ఆ సమయంలోనే నేను చదివిన వివేకానంద సూక్తులు నన్ను బాగా ఆలోచింపజేశాయి. చదువు మీద, జీవితంపై పట్టుదల పెరిగింది. ఆ రోజు నుంచి నా జీవితం మారిపోయింది’’ అని గతం గుర్తుచేసుకున్నారు జైపాల్. దారితప్పినవాడికి సరైన మార్గం దొరికినపుడు ఆ మార్గం గురించి నలుగురికీ చెప్పాలన్న ఉత్సాహం ఉంటుంది. అలాంటి ఆసక్తే జైపాల్‌ను వక్తిత్వవికాస నిపుణుడిని చేసింది.

 పాఠశాలలే టార్గెట్...
 ఎం.ఏ ఇంగ్లిష్, ఎమ్‌సిఏ, ఎమ్మెస్సీ సైకాలజీ ...మూడు పీజీలను చేతిలో పెట్టుకున్న జైపాల్ ‘మనదేశం- మన సేవ’ పేరుతో విద్యార్థులకు ఉచితంగా వ్యక్తిత్వ వికాస పాఠాలు నేర్పడానికి సిద్ధపడ్డారు. ఉపాధి కోసం నిజామాబాద్ జిల్లా బాన్సువాడలో ‘లక్ష్యం స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్’  ఏర్పాటుచేసుకున్నారు. అందులో వచ్చిన ఆదాయంలో ఇరవై అయిదు శాతం డబ్బుని ‘మనదేశం - మన సేవ’ కార్యక్రమం కోసం ఖర్చుపెడుతున్నారు.

  ‘‘ముందుగా నిజామాబాద్‌లో ఉన్న ప్రభుత్వపాఠశాలల లిస్టు తీసుకుని వాటితో మొదలుపెట్టాను. నా పాఠాల్లో ముఖ్యాంశాలు...పోటీ పరీక్షలు, ఫెయిలయినప్పుడు ఆలోచించేతీరు, లింగవివక్ష, ఆర్థిక సమస్యలు, కుటుంబం, అనుబంధాలు... వంటి అంశాలపై దృష్టి పెట్టి విద్యార్థులకు పాఠాలు చెబుతున్నాను. పాఠశాలను మాత్రమే దృష్టిలో పెట్టుకోకుండా అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా వ్యక్తిత్వవికాస పాఠాలుంటాయి. నా పాఠాలు విద్యార్థుల మెదడులోకి వెళుతున్నాయనడానికి నిదర్శనంగా, క్లాస్ పూర్తవ్వగానే పిల్లలు తమకున్న సందేహాలను  తీర్చుకుంటారు’’ అని తన పాఠాల అనుభవాల్ని చెప్పారు జైపాల్.

 పుస్తకంతో...
 జైపాల్ పాఠాలు పిల్లలకు డేప్లాన్ మొదలు కెరీర్ వరకు అన్నీ ఉంటాయి. ఇప్పటివరకు వివిధ జిల్లాలలోని 1102 పాఠశాలలు, కళాశాలలలోను, ప్రభుత్వరంగ పథకాల మహిళాసంఘాలవారికి వ్యక్తిత్వవికాసపాఠాలు చెబుతున్నారు జైపాల్.

 ‘ఆడపిల్లలకు ఇవ్వవలసినప్రాధాన్యత’ అనే అంశంపై మహిళలకు జైపాల్ చెప్పే పాఠాలు మనోధైర్యాన్ని ఇస్తున్నాయి. ‘ఓ నేస్త్తమా! నీతో నువ్వే పోటీ పడితే’ పేరుతో తాను రాస్తున్న పుస్తకంలో యువతకు మంచి సందేశం ఉందని చెబుతున్నారు జైపాల్. ఈ యువమాస్టార్ చెప్పే వ్యక్తిత్వవికాస పాఠాలు విద్యార్థుల భవిష్యత్తుకే కాదు గ్రామీణ మహిళల జీవితాల్లో కూడా వెలుగులు నింపుతాయి.
 - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

No comments:

Post a Comment