Thursday, 14 November 2013

నవయువం : ఈ టైమ్ వీళ్లదే..!

Sakshi | Updated: November 15, 2013 01:53 (IST)
నవయువం :  ఈ టైమ్ వీళ్లదే..!
 తమకు ప్రావీణ్యం ఉన్న రంగాల్లో గొప్ప విజయాలను సాధిస్తున్న యువతకు ‘టైమ్’ పత్రిక మంచి గుర్తింపు ఇచ్చింది. ప్రపంచంలోని ప్రముఖ వ్యక్తులను ‘ప్రభావాత్మకమైన’ వ్యక్తులుగా సత్కరిస్తున్న ఈ పత్రిక తాజాగా ‘ప్రభావాత్మకమైన యువత’ను ఎంపిక చేసింది.

 వివిధ రంగాల్లో తమ ముద్రను వేసిన టీనేజర్లతో కూడిన జాబితా ఇది. వ్యక్తిగత ప్రతిభతో వెలుగులోకి వచ్చినవారు, పోరాట పంథాతో వెలుగులోకి వచ్చినవారు, క్రీడాకారులు, టెక్, వ్యాపార రంగాల ప్రతినిధులు, కుటుంబ నేపథ్యంతో పేరు పొందినవారు.. అందరూ టీనేజర్లే.. తమ తమ రంగాల్లో అగ్రస్థాయిలో నిలిచిన, నిలుస్తున్న వారే. వారి గురించి...

 ఇంతవరకూ అత్యంత ప్రభావాత్మకమైన వ్యక్తుల జాబితానే ఎంపికచేస్తూ వచ్చిన టైమ్ మ్యాగజీన్, ఇప్పుడు అత్యంత ప్రభావశీల యువతను ఎంపిక చేసింది. 16 మందితో ఈ జాబితాను రూపొందించింది. దీనిలో నంబరింగ్ ఏమీ లేదు. ప్రాధాన్యతపరంగా టైమ్ ప్రస్తావించిన వరస ఇది...

 అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కూతురు ఆలియా. 15 యేళ్ల ఆలియా తన తండ్రిని ప్రభావితం చేస్తోందని టైమ్ వ్యాఖ్యానించింది. తను తీసుకొనే పలు నిర్ణయాల్లో తన కూతుళ్ల ప్రభావం ఉందని ఒబామా అనేక సార్లు ప్రస్తావించిన విషయాన్ని ఉటంకించింది. ఒబామా రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఆయన కూతుళ్లకు మంచి గుర్తింపు వచ్చిందనీ, అమెరికన్ యువతకు వారు ప్రత్యేక ఆకర్షణగా మారారనీ ‘టైమ్’ పేర్కొంది.

 పాకిస్తాన్‌కు చెందిన యూసుఫ్ మలాలా జాయ్(16) ఈ జాబితాలో తర్వాతి ప్రాధాన్యత పొందింది. తాలిబన్ల దాడికి గురై, కోలుకొని పాకిస్తాన్‌లో బాలికల విద్య కోసం పోరాడుతున్న ఈ బాలికను స్ఫూర్తిమంతమైన యువతిగా గుర్తించింది టైమ్. నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ అయిన మలాలాకు ఈ జాబితాలో స్థానం దక్కడం పెద్ద విశేషం కాదనుకోవాలి.

 తర్వాత జస్టిన్‌బీబర్... కెనడాకు చెందిన ఈ యువగాయకుడిని ‘ఇండస్ట్రీ టు హిమ్‌సెల్ఫ్’గా గుర్తించింది టైమ్. ఫోర్‌‌బ్స జాబితాలో యువ ధనవంతుల్లో ఒకడిగా నిలిచిన బీబర్‌కు పాశ్చాత్య ప్రపంచంలో మంచి ఫాలోయింగ్ ఉంది. అతడి పాటకు ఉన్న గుర్తింపు గురించి టైమ్ మ్యాగజీన్ ప్రస్తావించింది. ఆ తర్వాత న్యూజిలాండ్ గోల్ఫ్‌ప్లేయర్ లిడియాకో (16) లేడీస్ ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోషియేషన్(ఎల్‌పీజీఏ) కు రెండు విడతలుగా గెలిచిన ఆమె అత్యంత చిన్న వయసులో ప్రొఫెషనల్ టోర్నీలో విజయం సాధించిన యువతిగా నిలిచింది.

  2012 లండన్ ఒలింపిక్స్‌లో ఆరు బంగారు పతకాలు గెలిచిన అమెరికన్ స్విమ్మర్ మిస్సే ఫ్రాంక్లిన్(18) కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించింది. ఒక మహిళా స్విమ్మర్ ఈ స్థాయిలో పతకాలు గెలవడం అదే తొలిసారి. టీనేజ్‌లోనే ఈ ఘనతను సాధించినందున టైమ్ జాబితాలో స్థానం లభించింది. తర్వాతి వంతు నిక్‌డీ అలోయ్‌సియో(18) సమ్లీ అప్లికేషన్ రూపకర్త అయిన నిక్ దాన్ని యాహూ కంపెనీకి అమ్మడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఈ బ్రిటిష్ ఆస్ట్రేలియన్ భారీ స్థాయి డీల్‌తో అందరికీ పరిచయం అయ్యాడు. ఐనోట్ బుదిస్టేన్యూ... రొమేనియాకు చెందిన ఈ హైస్కూల్ స్టూడెంట్ తక్కువ ఖర్చుతో నడిచే సెల్ఫ్ డ్రైవింగ్ కారును రూపొందించాడు.

  ఇంటెల్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫెయిర్‌లో దీన్ని ఆవిష్కరించారు. ఈ ఘనతతో టైమ్ జాబితాలో నిలిచాడు. తర్వాత తన హెయిర్ స్టైల్‌తో అమెరికా అధ్యక్షుడి ప్రశంసలు కూడా పొందిన డాంటే బ్లాసియో ఉన్నాడు. డాంటే న్యూయార్క్ మేయర్ బిల్ డే బ్లాసియో కుమారుడు. న్యూయార్క్  ‘లేటెస్ట్ ఫ్యాషన్’ ఐకాన్‌గా డాంటేకు గుర్తింపు ఉంది. ఆ తర్వాతి స్థానంలో మోడలింగ్‌లో ప్రతిభావంతులైన కెండల్, కైనీ జెన్నర్ అనే అక్కచెల్లెళ్లు (18,16) ఉన్నారు. అమెరికాకు చెందిన వీరు టైమ్ గుర్తింపుతోనే వెలుగులోకి వచ్చారు. న్యూజిలాండ్‌కు చెందిన లార్డే (17) అనే సింగర్, సాంగ్ రైటర్ తర్వాతి స్థానంలో ఉంది. 14 యేళ్లకే ఫ్యాషన్ ఐకాన్‌గా ఎదిగిన అమెరికన్ కీరన్ ష్పిక(14) ఆ తర్వాతి ప్రాధాన్యత పొందింది. 15 సంవత్సరాలకే ప్రముఖ రచయితగా ఎదిగిన మాయా వన్ వాగెనెన్, యూకేకు చెందిన రచయిత్రి బెత్ రీక్లెస్(17) నటి చోలే గ్రేస్ మొరెట్జ్(16) లు ఉన్నారు. మొరెట్జ్ హాలీవుడ్ నటి. ‘కేరీ’ అనే హారర్ సినిమాలో నటించింది. నటిగా, ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె తన ప్రతిభను నిరూపించుకొంటోంది. 13 యేళ్లకే హాలీవుడ్‌లో అకాడమీ అవార్డుకు నామినేట్ అయిన హైలీ స్టీన్‌ఫెల్డ్‌తో ఈ జాబితా పూర్తి అవుతుంది. వీరందరికీ ప్రాంతాలకు అతీతంగా యువతకు స్ఫూర్తిగా నిలబడగల శక్తి ఉందని టైమ్ అభిప్రాయపడింది.
 -జీవన్ రెడ్డి.బి

No comments:

Post a Comment