Sunday, 3 November 2013

ఆ పిల్లలనైనా చదివించుకుందాం

ఏ దినపత్రిక చూసినా 'అప్పుల బాధ తట్టుకోలేక రైతు ఆత్మహత్య' వార్త ఉంటుంది. రైతు మరణించిన తర్వాత ఆ కుటుంబం పరిస్థితి ఏమిటి, ఆయన భార్య ఎలా బతుకుతుంది, బిడ్డల భవిష్యత్తేమిటి అన్నది మాత్రం ఎక్కడా కనిపించదు. ఆ విషయాలను తెలుసుకుని అవసరమైతే సాయపడాలన్న ఆలోచన కొందరికే ఉంటుంది. అది ఉన్న కొందరు విద్యావంతులు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి 'కేరింగ్ సిటిజెన్స్ కలెక్టివ్' (సీసీసీ)గా ఏర్పడ్డారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల బిడ్డల చదువులు ఆగిపోకుండా చూసేందుకు సీసీసీ ప్రయత్నిస్తోంది.

'వ్యవసాయమే జీవనాధారంగా చేసుకుని పదిమందికి అన్నం పెట్టే రైతు బలవంతంగా చనిపోతే దేశానికి జరిగే నష్టం మాట సరే, ముందు ఆ కుటుంబాల్లో పిల్లల చదువు ప్రశ్నార్థకమయిపోతోంది. వాళ్ల భవిష్యత్తు సర్వనాశనమైపోతోంది. వాళ్ల చదువు కొనసాగేలా కొంత ప్రయత్నం చెయ్యగలిగితే ఆ కుటుంబంలో ధైర్యం పెరుగుతుంది...' అన్నది సీసీసీ ఆలోచన. ఆ దిశగా ముందడుగేసిన 'కేరింగ్ సిటిజెన్స్ కలెక్టివ్' చొరవ వల్ల ప్రస్తుతానికి 150 - 200 మంది పిల్లలు తమతమ చదువులను కొనసాగిస్తున్నారు. ప్రాథమిక స్థాయి నుంచి బీటెక్, ఎంబీబీఎస్, బీఈడీ మొదలైనవి చదువుకుంటున్నారు వాళ్లు. పదో తరగతి లోపు చదువైతే ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో చేర్పిస్తారు. ఆపై చదువులకు ప్రైవేటు సంస్థల్లోనైతే యాజమాన్యాలతో మాట్లాడి ఉచితంగా చేర్చుకునేలా చెయ్యడం, బస్సు పాసు, పుస్తకాల వంటి ఇతర అవసరాల కోసం దాతలను సంప్రదించడం వంటి బాధ్యత అంతా నెరవేరుస్తుంది సీసీసీ.

అందరూ కలిసొస్తే...
మెదక్ జిల్లా కొండాపూర్ గ్రామానికి చెందిన సోనీ తండ్రి ఆత్మహత్య చేసుకుని పదేళ్లవుతోంది. తల్లి బీడీలు చుట్టి, రోజు కూలీకి వెళ్లి సంపాదిస్తున్న వాళ్లకు పూట గడవడమే కష్టంగా ఉంది. సీసీసీ చొరవతో ఇప్పుడు సోనీ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. 'అమ్మ పడే కష్టం చూడలేకపోతున్నాను. దానికితోడు ఏ రోజు నా చదువు ఆగిపోతుందో అని భయంభయంగా ఉండేది. కాని ఇప్పుడు నాతోపాటు మా తమ్ముడు, చెల్లి కూడా చదువుకుంటున్నారు..' అని చెప్పింది సోనీ. వాళ్లకున్న రెండెకరాల భూమి ఇంకా పట్టా అవాలి. ఇరవయ్యేళ్ల జ్యోతిదీ అలాంటి కథే. ఆమె తండ్రి మూడేళ్ల క్రితం చనిపోయాడు. "రెండు నెలల్లో తొమ్మిది సార్లు మోటారు కాలిపోయింది. వాటిని బాగుచేయించలేక అప్పుల పాలయి మా నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు.

ఇప్పటి వరకూ ప్రభుత్వం నుంచి పరిహారం ఏదీ రాలేదు. కాని సీసీసీ కార్యకర్తల సాయంతో నేను డిగ్రీ పూర్తి చేశాను. ఇందులోనే చిరుద్యోగిగా చేరాను'' అని చెప్పింది జ్యోతి. ఇటువంటి విద్యార్థుల చదువుకు కట్టుదిట్టాలు చేస్తూనే మరోవైపు రైతుల భార్యలకు ధైర్యాన్నివ్వడం, ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చేలా చెయ్యడం వంటివీ చేస్తుంది సీసీసీ. భర్త మరణంతో షాక్‌కు గురైన మహిళలను ఓదార్చడంతో పాటు దాన్నుంచి బైటికి తీసుకొచ్చి తమ కాళ్ల మీద తాము నిలబడటానికి తగిన ధైర్యాన్నిస్తోందీ సంస్థ. ప్రస్తుతానికి ఎక్కువగా మెదక్, మహబూబ్‌నగర్, వరంగల్, హైదరాబాద్ జిల్లాల్లో పనిచేస్తోంది సీసీసీ. బాధ్యత కలిగిన పౌరులు కలిసొస్తే ఇంకా ఎందరో విద్యార్థుల జీవితాల్లో అక్షర దీపాలు వెలిగించాలన్నదే కేరింగ్ సిటిజెన్స్ కలెక్టివ్ ఆలోచన.
సీసీసీ ఆఫీసు ఫోన్లు : 040 27619063, 9948897734

వరంగల్ జిల్లా నారాయణగిరి గ్రామానికి చెందిన రాణి పదో తరగతి పాసవగానే దగ్గర్లోని పీసర గ్రామంలోని వ్యవసాయదారుడికిచ్చి పెళ్లి చేశారు. పెళ్లయిన ఐదు నెలలకే ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటు ప్రభుత్వం నుంచి పరిహారమేదీ అందలేదు. పెళ్లప్పుడు చెల్లించిన కట్నం డబ్బు అత్తింటివారు తిరిగివ్వలేదు. దానికోసం పెట్టిన పెద్దమనుషుల పంచాయితీకి చాలా ఖర్చవడంతో ఆమె పుట్టింటివారు ఆశలన్నీ వదిలేసుకున్నారు. 'చిన్నవయసే కదా, చదువుకో' అంటారు అందరూ. కాని చేతిలో రూపాయి లేనిదే ఆగిపోయిన చదువును ఎలా కొనసాగించాలో, ముందు జీవితాన్ని ఎలా గడపాలో తెలియక రాణి కన్నీరుమున్నీరయింది. ఆమెను ఇంటర్మీడియెట్‌లో చేర్పిస్తోంది సీసీసీ.

చట్టాలున్నా ఫలితం లేదు

వ్యవసాయ రంగంలో సంభవించిన మార్పుల వల్ల 1995 నుంచి 2012 వరకు మన రాష్ట్రంలో 35898మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. రైతు ఆత్మహత్యకు పాల్పడితే, ఆ కుటుంబానికి లక్షన్నర రూపాయలు పరిహారంగా అందిస్తామని చట్టం చేసింది ప్రభుత్వం. 2004లో వచ్చిన జీవో 421 ప్రకారం ఆర్థిక సాయం అందించడమే కాకుండా, పిల్లలకు హాస్టల్ వసతి కల్పించి చదువుల బాధ్యతను కూడా ప్రభుత్వమే కల్పిస్తుందని అందులో పేర్కొంది. కాని ఆ పరిహారం అందింది 20 శాతంలోపు కుటుంబాలకే. క్రమంగా ప్రభుత్వం రైతు ఆత్మహత్యలను పట్టించుకోవడం మానేసింది. రైతుల ఆత్మహత్యలు వ్యవసాయంలో నష్టాల వల్ల కాదని ఋజువు చెయ్యడానికే ప్రయత్నిస్తుంది గ్రామ స్థాయి నుంచి అధికార యంత్రాంగమంతా. దీన్ని ఎదుర్కోవడమే వారి భార్యలకు పెద్ద సమస్య అయిపోయింది. పిల్లల చదువులు రెండో సమస్య.

అరుణ పప్పు
ఫోటోలు : నవీన్
Courtesy-Andhrajyothy

No comments:

Post a Comment