Sunday, 3 November 2013

అలసటను దూరం చేద్దాం..

జీవితంలో ఉరుకులుపరుగులు పెరగడంతో చిన్నపిల్లల మొదలు పెద్దవాళ్ల వరకు అందరూ పని ఒత్తిడి తో సతమతమవుతున్నారు. దూర ప్రయాణాల వల్ల అలసటకు గురవుతున్నారు. దీనినుంచి బయటపడి, ఏ రోజుకారోజు ఫ్రెష్ అవడానికి మార్గం ఉంది. అదే భ్రమరి ప్రాణాయామం. భ్రమరం అంటే తుమ్మెద. తుమ్మెద ఝంకారం ఎలా ఉంటుందో ఈ ప్రాణాయామ శబ్దం అలా ఉంటుంది. అందుకే దీన్ని భ్రామరి అంటారు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు 10 నిమిషాలు దీన్ని సాధన చేస్తే సుఖంగా నిద్రపడుతుంది, అలసట, ఒత్తిడి దూరమవుతాయి.

చాప మీద వజ్రాసనంలో కూర్చుని రెండు అరచేతుల బొటనవేళ్లు చెవిలో పెట్టి చూపుడు వేలు, మధ్యవేళ్లను రెండు కళ్ల మీద సుతారంగా పెట్టాలి. ఉంగరం వేళ్లు రెండూ ముక్కు రంధ్రాల దగ్గర పెట్టి చిటికెన వేళ్లు పెదవి చివర పెట్టి గాలి పూర్తిగా తీసుకుని ఓంకార శబ్దాన్ని జపిస్తూ గాలిని పూర్తిగా వదిలెయ్యాలి. ఇలా ఐదుసార్లు చేసి రెండు చేతులూ చిన్ముద్రలో పెట్టి కళ్లు మూసుకుని ఆ నిశ్శబ్దాన్ని గమనించాలి.

యోగనిద్ర : భ్రామరి పూర్తయిన తర్వాత శవాసనంలో పడుకుని శరీరంలో ఒక్కొక్క భాగాన్ని ఆలోచన ద్వారా గమనించాలి. కుడికాలి బొటనవేలు మొదలుకొని మడమలు, మోకాళ్లు, తొడలు, పిరుదులు, నడుము, పొట్ట, ఛాతీ, మెడ, భుజం, కుడిచెయ్యి, మోచెయ్యి, మణికట్టు, అరిచేతులు, వేళ్లు.... ఇలా కింద నుంచి పైకి రావాలి. తర్వాత కుడి చేతి వేళ్ల నుంచి కుడికాలి వేళ్లవరకు ఒక్కొక్క అవయవాన్ని గమనించాలి. ఇలాగే ఎడమవైపు కూడా అన్ని భాగాలనూ గమనించాలి. రెండు వైపులా పూర్తయిన తర్వాత శరీరం లోపలి భాగాలను కూడా గమనించాలి. ఇదంతా చెయ్యడానికి పది నిమిషాలు పడుతుంది. అన్ని పనులూ పూర్తయ్యాక రాత్రి నిద్రపోయే ముందు దీన్ని చేస్తే చక్కటి నిద్ర పడుతుంది. అలసట, ఒత్తిడి తగ్గి మర్నాటికి తాజాగా ఉన్న భావన కలుగుతుంది.

ఆహారం : పని ఒత్తిడి వల్లో, అలసట ఎక్కువయ్యో కొందరు మూడు పూటల్లో ఏదో ఒకసారి తినడం మానేస్తుంటారు. కాని అలా మానెయ్యకూడదు. ప్రతి రెండు గంటలకు ఏదో ఒకటి సమతుల ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. తాజా కూరగాయలు, పండ్లు, చిరుధాన్యాలు ఎక్కువగా తినడం మంచిది.
Courtesy-Andhrajyothy

No comments:

Post a Comment