Sunday, 3 November 2013

ఐటీలో 'సాఫ్ట్'గళం

హైటెక్ నగరిలో మరొక కొత్త స్వరం 'ఫోరం ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్'. అన్ని రంగాలలో వినిపించే ఉద్యోగుల హక్కుల స్వరాన్ని.. ఇక నుంచి ఐటీ రంగంలోనూ వినిపించడానికి ఇప్పుడిప్పుడే శక్తియుక్తుల్ని కూడదీసుకుంటోందీ సంస్థ. భావసారూప్యత కలిగిన కొందరు ఐటీ ఉద్యోగులు నడుపుతున్న ఆ ఫోరం గురించి తెలుసుకుందాం..

నిర్భయ, అభయ, అన్నాహజారే, అవినీతి, ఎన్నికలు, నరేంద్రమోడీ, రాహుల్‌గాంధీ, విదేశీ పెట్టుబడులు.. రూపాయి పతనం - ఇవన్నీ చర్చించే తీరిక, ఓపిక ఐటీ ఉద్యోగులకు ఉంటుందా? పొద్దున్నే క్యాబ్ ఎక్కి ఆఫీసుకు చేరుకుంటే ఏ అపరాత్రో ఇంటికొచ్చి కూలబడే వీరికి సామాజిక అంశాల గురించి మాట్లాడుకునే అవకాశం ఎక్కడిది? వాళ్లంతా అద్దాలమేడల ప్రపంచంలో మునిగిపోయి.. జన జీవన ప్రపంచానికి దూరమైపోతున్నారా? బయటి నుంచి చూసేవాళ్లకే కాదు. ఆఫీసుల్లోని ఐటీ ఉద్యోగులను కూడా ఇదే అభిప్రాయం వెంటాడుతోందిప్పుడు. పని.. పని.. పని ఒక్కటే కాదు జీవితం. చుట్టూ మనుషులు, సమాజం, రాజకీయాలు, సమస్యలు, ఆందోళనలు, సంఘర్షణలు.. బోలెడన్ని అంశాలు ఉన్నాయి.

అవన్నీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అందర్నీ ఎంతోకొంత ప్రభావితం చేసేవే! మనకేమీ సంబంధం లేదు పొమ్మంటే కుదరదు. ఆఫీసు కిటికీలు తెరుచుకుని బయటి ప్రపంచాన్ని పరిశీలించాలి. గళం విప్పాలి. అవసరమైతే రోడ్ల మీదికి వచ్చి పోరాటమూ చెయ్యాలి... అంటున్నారు ఐటీ ఉద్యోగులు. ఆ భావనతోనే కొందరు ఉద్యోగులు ఒక గూటికి చేరి పెట్టుకున్న పేరు 'ఫోరం ఆఫ్ ఐటీ ప్రొఫెషనల్స్'. "ఇదేమీ కార్మిక సంఘం కాదు. స్నేహశీల వాతావరణంలో మాకున్న అభిప్రాయాల్ని చెప్పడానికి ఏర్పాటు చేసుకున్న వేదిక మాత్రమే. ఐటీ కంపెనీలన్నీ బహుళజాతి సంస్థల విధానాల మీద, అవసరాల కోసం పనిచేస్తున్నవి కాబట్టి ఉద్యోగులు సంఘాలు పెడితే ఒప్పుకోరు. అలాగని, ఎవరికి వారు మిన్నకుండిపోతే ఈ రంగం గురించి మాట్లాడే వారే లేకుండా పోతారు. ఆ పనిని మేము చేయాలనుకున్నాం. పలు ఐటీ సంస్థలలో పనిచేసిన అనుభవం నాకుంది. భావసారూప్యత కలిగిన ఐటీ ఉద్యోగ మిత్రులందర్నీ కలుపుకోగలిగాము. ఐటీ రంగంలో ఇదొక కొత్త గొంతుక'' అన్నారు ఫోరం నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్న సిద్ధార్థ.

కదిలారు ఇలా..
ఫోరం ఫర్ ఐటీ ప్రొఫెషనల్స్ అనేది ఉద్యోగుల అవసరం నుంచి పుట్టుకొచ్చింది. కొంతకాలం కిందట హైటెక్‌సిటీ పరిసరాల్లోని ఐటీ కంపెనీలకు వెళ్లాలంటే ఆటోలు, కార్లు తప్ప మరొక మార్గం ఉండేది కాదు. విశాలమైన రోడ్లున్నా బస్సులు మాత్రం తిరిగేవి కావు. "హైటెక్‌సిటీ నుంచి లోపలికి వెళ్లడం పెద్ద ప్రయాస. అన్ని కంపెనీలు ఉద్యోగులకు రవాణా సదుపాయం కల్పించలేవు. ఎవరికివారు సొంత రవాణాను సమకూర్చుకోవాల్సిందే. ముఖ్యంగా అమ్మాయిల కష్టాలు చెప్పడానికి లేదు. ఆఫీసులో పనివేళలు ముగుస్తూనే రోడ్డు మీదికొచ్చి గంటలతరబడి నిరీక్షిస్తే కానీ ఆటోలు దొరికేవి కావు. ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లడం ఎంత కష్టమో మళ్లీ పొద్దున్నే ఆఫీసుకు రావడమూ అంతే కష్టం. ఇంతపెద్ద మహానగరంలో గల్లీ గల్లీకి బస్సులు తిరుగుతున్నాయి. మరెందుకు హైటెక్‌సిటీ వైపు రావు? అని ఇద్దరు ముగ్గురు స్నేహితులం ఆలోచించాం. ఇలా ఒకరికొకరు అనుకుని వందలు వేల మంది మద్దతు కూడగట్టాము. పదివేల సంతకాలతో రవాణాశాఖ మంత్రికి వినతిపత్రం ఇచ్చాము. వెంటనే ఆర్టీసీ అధికారులు ఒక సర్వేచేసి.. బస్సుల అవసరం ఉందని తేల్చారు. ఆ తర్వాత బస్సుల్ని ఏర్పాటు చేశారు.

ఇది చిన్న విజయమే అయినా మా బిజీ జీవితాలకు ఇదొక పెద్ద ఘనకార్యం. పదిమంది చేతులు కలిపితే సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవచ్చో ఆ అనుభవం ద్వారా తెలిసింది'' అన్నారు ఫోరం సభ్యులు ఉపేంద్ర, మల్లిక, కార్తీక్. హైటెక్‌సిటీ నుంచి ఇన్ఆర్బిట్‌మాల్ వరకు పెద్ద పెద్ద ఐటీ సంస్థలు చాలా ఉన్నాయి. వచ్చేపోయేవాళ్లతో రద్దీగా ఉంటుంది ఆ ప్రాంతం. కాని ఎక్కడా గ్లాసు మంచినీళ్లు దొరకవు. మరుగుదొడ్లు కనిపించవు. కోట్ల రూపాయలు విలువచేసే భూముల్ని ప్రభుత్వ రాయితీ మీద తీసుకున్న కంపెనీలు.. ప్రజాసౌకర్యాలను ఏర్పాటు చేయడంలో ఆసక్తి చూపడం లేదు అన్న విమర్శలు వచ్చాయి. "మా వంతు మేము స్పందించాలనుకున్నాము. ఐటీ ఉద్యోగుల సహాయంతో వేసవిలో తాగునీటి సౌకర్యాన్ని కల్పించాం. ఇది ఆటో డ్రైవర్లు, కార్ల డ్రైవర్లు, సందర్శకులకు ఎంతో ఉపయోగపడింది..'' అన్నారు ఫోరం ప్రతినిధులు.

సామాజిక అజెండాతో..
ఢిల్లీలో అన్నాహజారే ఉద్యమం చేసినపుడు.. ఐటీఫోరం కూడా మద్దతు పలికింది. "అవినీతితో ఐటీ రంగంలో ఉంటున్న మీకేమిటి సంబంధం? మీరు ఏవిధంగా నష్టపోతారు..? అని కొందరంటున్నారు. కచ్చితంగా నష్టపోతాం. అవినీతి పెరిగితే కొత్త కంపెనీలు మన దేశానికి రావు. బ్రాండ్ఇమేజ్ దెబ్బతింటుంది. ఔట్‌సోర్సింగ్ ప్రాజెక్టులు తగ్గిపోతాయి. తద్వారా ఉద్యోగాలు దొరకవు. సత్యం కంప్యూటర్స్ ఏమైంది? యాజమాన్యం కంటే ఉద్యోగులే ఎక్కువగా నష్టపోయారు. ఏదైనా ఐటీ కంపెనీ మూతపడితే ఉద్యోగులకు కొంత ఆర్థికభద్రత కల్పించాలి. మా డిమాండ్‌లలో ఇది కూడా ఒకటి..'' అన్నారు ఫోరం సభ్యులు. ఇలాంటి సామాజిక విషయాలపై కూడా ఐటీఫోరం చిన్నపాటి చర్చావేదికల్ని పెట్టుకుంటోంది.

వారాంతంలో పబ్బులు, రెస్టారెంట్లకు వెళ్లి ఎంజాయ్ చేసే ఐటీ ఉద్యోగుల తరహాలో కాకుండా.. దేశాన్ని పట్టిపీడిస్తున్న సామాజిక సమస్యల మీద గంభీరమైన చర్చల్లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు ఫోరం సభ్యులు. "నిజానికి ఇదొక శుభ పరిణామం. ఐటీ ఉద్యోగాల్లో పని ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. విశ్రాంతికే టైమ్ ఉండదు. అలాంటిది సమాజం గురించి ఆలోచించాలన్న తపన కొంతమందిలోనైనా మొదలవ్వడం గొప్ప విషయం'' అంటున్నారు సిద్ధార్థ. "ఐటీ ఫోరం సాధారణ ఉద్యోగ సంఘాల్లాంటిది కాదు. సామాజిక అంశాల మీద స్పందించడం ఒక కోణం. భావసారూప్యత కలిగినవాళ్లు కలవడానికి ఇదొక శిబిరం. కొందరేమో తాము చదివిన మంచి పుస్తకాల గురించి, చూసిన సినిమాల గురించి మిగిలిన వాళ్లతో పంచుకుంటారు. అందరం కలిసి కళాత్మక సినిమాలను చూస్తుంటాము. ఒక్కోసారి ఫోరమే జనం కోసం ప్రదర్శిస్తుంటుంది. నిర్భయ, అభయ ఉదంతాలను దృష్టిలో పెట్టుకుని ఈమధ్యనే పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 'ఇజ్జత్ నగరీకీ అసభ్య బేటీయా' అనే చిత్రాన్ని ప్రదర్శించాము. మంచి స్పందన వచ్చింది..'' అన్నారు.

పని ఒత్తిడిలోనూ చర్చలు..
పని ప్రదేశాల్లో మహిళలకు ఎదురవుతున్న సమస్యలు, బహిరంగ ప్రదేశాలలో భద్రత వంటి అంశాల మీద కూడా ఫోరం సెమినార్లు నిర్వహించింది. అభయ మీద జరిగిన అత్యాచారాన్ని వ్యతిరేకిస్తూ శిల్పారామం దగ్గర ర్యాలీ చేపట్టడంతోపాటు.. వేలాది సంతకాలను సేకరించి కమీషనర్‌కు అందజేసింది.అంతకుమునుపు నిర్భయ సంఘటనపై కూడా ఐటీ ఉద్యోగులను కదిలించింది ఫోరం. రాజధానిలోని నెక్‌లెస్‌రోడ్డులో వరుసగా మూడురోజులు ర్యాలీలు చేపట్టింది. "ఇంతకుమునుపు విద్యుత్ ఛార్జీలు, పెట్రోలు ధరలు పెరిగితే రాజకీయపార్టీలు ఆందోళనలు, ర్యాలీలు చేసేవి. మొన్నీమధ్య మేము కూడా చేశాము. కొందరు ఐటీ ఉద్యోగులు అన్నారు 'ఇవన్నీ మనమెందుకు చెయ్యాలి? మనకొచ్చిన నష్టమేంటి?' అని. ఇంధన ధరలు పెరిగితే ఐటీ కంపెనీల మీద, ఉద్యోగుల మీద ఏవిధమైన భారం పడుతుందో వివరించాము. అప్పుడు అసలు సమస్య అర్థమైంది వాళ్లకు. ఇంజనీరింగ్ కళాశాలల్లో నాణ్యత పడిపోతోందని ఆమధ్య నిరసన వ్యక్తం చేశాము. నైపుణ్యాలు లేకపోవడం వల్లే ఇంజనీరింగ్ పట్టభద్రులకు ఉద్యోగాలు దొరకడం లేదు. నిరుద్యోగుల్ని ఆసరా చేసుకుని కొన్ని నకిలీ సంస్థలు కూడా మోసాలకు పాల్పడుతున్నాయి..'' అని వివరించారు కౌసిక్, సిద్ధార్థ. త్వరలోనే ఒక సొంత ఆఫీసును ఏర్పాటు చేసుకుని.. మరింత గట్టిగా తమ స్వరాన్ని వినిపించేందుకు ఆరాటపడుతున్న 'ఐటీఫోరం' సామాజికవేత్తల మద్దతు కోరుకుంటోంది.
- మల్లెంపూటి ఆదినారాయణ
Courtesy-Andhrajyothy

No comments:

Post a Comment