Wednesday, 6 November 2013

క్యాన్సర్‌కు కట్టు వైద్యం

వ్యాధుల్లో రకాలు ఉన్నట్లే.. వైద్యవిధానాల్లో అనేక పద్ధతులు ఉన్నాయి. అన్నీ శాస్త్రీయం కాకపోయినా.. నమ్మకం మీద జరుగుతున్న చికిత్సలు చాలా ఉన్నాయి. వాటిలో - ఉబ్బసానికి చేప మందు, కాళ్లూ చేతులు విరిగితే పుత్తూరు వైద్యంలాంటివి కొన్ని. ఇలాంటి కోవలోనిదే హైదరాబాద్ పాతబస్తీలోని సుల్తాన్‌షాహీ ప్రాంతానికి చెందిన హకీమ్ అబ్దుల్లా బిన్ బదర్ వైద్యం. కుటుంబ వారసత్వంగా అబ్బిన వైద్యంతో క్యాన్సర్‌కు కట్టు వైద్యం చేస్తున్న ఆయన గురించే ఈ కథనం..

"మా తాతల కాలం నుంచి సంప్రదాయంగా వస్తున్న వైద్యం ఇది. మా వైద్యంతో క్యాన్సర్ పూర్తిగా నయం అయిపోతుందని మేము కూడా చెప్పము. క్యాన్సర్ తొలిదశలో ఉంటే మాత్రం మందు బాగా పనిచేస్తుంది. ఇక్కడొక విషయం చెప్పాలి. క్యాన్సర్ ఉండి ఆపరేషన్ చేయించుకున్న వాళ్లకు నేను వైద్యం చేయను. ఇప్పటి వరకు వేలాదిమందికి వైద్యం చేశాము. ఆ ఫలితాలను బట్టే మేము ఈ మాట చెప్పగలుగుతున్నాము''

పాతకాలం కలప కుర్చీ. దాని ముందు ఒక చిన్న టేబుల్. ఇరుకైన గది. అందులో కిక్కిరిసిన పేషెంట్లు. చూడటానికి సాదాసీదా మనిషిలా కనిపించే వైద్యుడు. పేరు : డాక్టర్ హకీమ్ అబ్దుల్లా బిన్ బదర్. అరవై ఏళ్ల వయసున్నా గట్టి మనిషిగా కనిపించే ఆయన పొద్దున్నించి సాయంత్రం వరకు అలుపులేకుండా పనిచేస్తూ కనిపిస్తున్నాడు. వచ్చిపోయే పేషెంట్లకు వైద్యం ఒక్కటే కాదు, ధైర్యాన్నీ నూరి పోస్తున్నాడు. "మీకేం పర్లేదు. అంతా మంచే జరుగుతుంది. పాజిటివ్‌గా ఆలోచించండి'' అంటూ క్యాన్సర్ పేషెంట్‌లకు రెండు మూడు ప్యాకెట్లలో మందులు ఇచ్చి పంపిస్తున్నాడు బిన్‌బదర్. "ధన్యవాదాలు సార్. వెళ్లొస్తాము'' అంటూ వైద్యుని చేతిలో కొంత మొత్తం పెట్టి వెళ్లిపోతున్నారు పేషెంట్లు. ఆయనేమీ ఇంత ఫీజు ఇవ్వమని అడగరు. ఇస్తే తీసుకుంటాడు. లేకపోతే లేదు.
ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ప్రాణాంతకమైన జబ్బు ఎయిడ్స్ కాదు, క్యాన్సర్! ఆ మహమ్మారిని అరికట్టేందుకు వైద్యప్రపంచం శక్తియుక్తులన్నిటినీ కూడగట్టి నిరంతర పరిశోధనలు చేస్తూనే ఉంది. కొత్త వైద్యాన్ని వెలుగులోకి తీసుకొస్తూనే ఉంది. అయినా ఇప్పటికీ క్యాన్సర్‌ను పూర్తిస్థాయిలో అదుపుచేసే వైద్యం లేదు. మన దేశంలో ఎన్ని వైద్యవిధానాలు ఉన్నా క్యాన్సర్‌కు మాత్రం అల్లోపతి ఒక్కటే శరణ్యం అయిపోయిందిప్పుడు. మిగతావి నేటి శాస్త్రీయ వైద్య విధానం ధాటికి నిలబడకపోయినా.. వాటిని విశ్వసించేవాళ్లు మాత్రం కొందరు ఉన్నారు. అలాంటి కోవలో చేస్తున్న వైద్యమే బిన్ బదర్ కట్టు వైద్యం. కొన్నేళ్ల నుంచి క్యాన్సర్‌తోపాటు మరికొన్ని మొండి వ్యాధులకు యునానీ వైద్యం చేస్తున్నాడీయన. "మా తాతల కాలం నుంచి సంప్రదాయంగా వస్తున్న వైద్యం ఇది. మా వైద్యంతో క్యాన్సర్ పూర్తిగా నయం అయిపోతుందని మేము కూడా చెప్పము. క్యాన్సర్ తొలిదశలో ఉంటే మాత్రం మందు బాగా పనిచేస్తుంది. ఇక్కడొక విషయం చెప్పాలి. క్యాన్సర్ ఉండి ఆపరేషన్ చేయించుకున్న వాళ్లకు నేను వైద్యం చేయను. ఇప్పటి వరకు వేలాదిమందికి వైద్యం చేశాము. ఆ ఫలితాలను బట్టే మేము ఈ మాట చెప్పగలుగుతున్నాము'' అన్నారు అబ్దుల్లా బదర్.
వారసత్వ వైద్యం..
బిన్ బదర్ తాతగారు ముబారక్ బిన్ అబూద్ యునానీ వైద్యుడు. ఆయన యెమన్‌లో జన్మించి అక్కడే పెరిగారు. క్యాన్సర్‌ను నయం చేసే వైద్యాన్ని యెమన్‌లోనే నేర్చుకున్నాడట. చెట్ల వేర్లు, ఆకులు, ఔషధగుణాలు కలిగిన మట్టి, కొన్ని రకాల వనమూలికల వంటివన్నీ వంద రకాల వరకు కలిపి ఒక మందును తయారు చేసేవాడాయన. అదే బిన్ బదర్‌కు వారసత్వంగా అబ్బింది. ఆ మందును తయారుచేసే విధానాన్ని ఇప్పటికీ గోప్యంగానే ఉంచుతోంది ఆ కుటుంబం. "ఆఖరి నిజాం కాలంలో మా తాతగారు అప్పటి డిఫెన్స్ మినిస్టర్ దగ్గర పీఏగా చేశాడు. ఆయన నుంచి మా పెదనాయన వైద్యం నేర్చుకుంటే.. అతని నుంచి నేను నేర్చుకున్నాను. నేను గత పదమూడు ఏళ్ల నుంచి వైద్యం చేస్తున్నాను. కొన్ని క్యాన్సర్‌లకు ఏ మందులూ పనిచేయవు. అల్లోపతి మీద నాకు ఎలాంటి చెడు అభిప్రాయమూ లేదు. అయితే ఇప్పుడున్న ఆధునిక వైద్యం రసాయనాలతో కూడింది. సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. నేను చేస్తున్నది సహజసిద్ధమైన అతి పురాతనమైన యునానీ వైద్యం. ఎలాంటి దుష్ఫ్రభావాలు కలగవు'' అని బిన్ బదర్ హామీ ఇస్తున్నాడు.
కట్లు కడతారు...
మందును వెడల్పాటి గుడ్డలోకి వేసి.. దాన్ని క్యాన్సర్ ఉన్న చోట కట్టుకట్టడం వీరి వైద్య విధానం. వ్యాధిని బట్టి రెండు నుంచి అయిదు నెలల వరకు రెగ్యులర్‌గా ఈ కట్లు కట్టించుకోవాలి. రోజుకు రెండు పట్టీలు చొప్పున కడతారు. ఆ తర్వాత స్కానింగ్‌చేసి క్యాన్సర్ తగ్గిందో లేదో నిర్ధారణ చేసుకుంటామని వైద్యుడు చెబుతున్నాడు. ఇదివరకైతే తమకున్న పొలంలోనే వనమూలికలను పండించుకునేవారట. ఇప్పుడు భూమి లేకపోవడంతో రంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి వాటిని సేకరిస్తున్నారు. రోజురోజుకు క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతుండటంతో వనమూలికల సేకరణ కూడా కష్టమైంది. "ఒకప్పుడు ఇంతమంది క్యాన్సర్ పేషెంట్లు వచ్చేవాళ్లు కాదు. ఇప్పుడు రోజుకు కనీసం రెండొందల మంది నా వద్దకు వస్తున్నారు. క్యాన్సర్ రావడానికి ఆహారపు అలవాట్లు, జీవనవిధానం, మానసిక ఒత్తిళ్లు, పురుగుమందులు ఇవన్నీ కారణం. ఉదాహరణకు ఒకటి చెబుతాను.. ఈ తరం పిల్లలు ఇంటర్‌నెట్ సెక్స్, ఫోన్ సెక్స్‌లకు బానిసలైపోతున్నారు. ఇంట్లో ఒక గదిలో తల్లిదండ్రులుంటే, మరో గదిలో కంప్యూటర్ మీద కూర్చునో, బాల్కనీలో ఫోను పట్టుకునో ఆ పని చేస్తున్నారు. అసహజమైన పద్ధతుల ద్వారా ఎవరికి వారే శరీరాన్ని ఉద్వేగాలకు గురిచేసుకోవడం వల్ల.. హృదయస్పందనల రేటు పెరుగుతుంది. శరీరంలో అధికరక్తపోటు, మధుమేహాలకు దారి తీస్తుంది. మనసు వికలం అయితే.. శరీరం కాకుండా ఉంటుందా? ఇవన్నీ కూడా మొండి వ్యాధులకు దారి తీసే పరిస్థితులే! పెద్ద జబ్బులు రావడానికి ఇవే కాదు, మనకు తెలియని కారణాలు మరెన్నో ఉంటున్నాయి. అవి మాకే కాదు, ప్రతిదానికీ స్కానింగ్‌ల మీద ఆధారపడే అల్లోపతి వైద్యులకు కూడా తెలియడం లేదు.
శరీరాన్ని వేడిగా ఉంచుకోండి...
సరే, అవన్నీ పక్కనపెడితే - నా అనుభవంలో క్యాన్సర్‌కు ప్రధాన కారణం.. శరీరంలో వేడి తగ్గడం. శరీరం శీతలం అయ్యేవాళ్లకు క్యాన్సర్ ముప్పు ఎక్కువ. వేడి కోసం కోడిగుడ్లు, చేపలు, రొయ్యలు, రాగులు, అంజీరపండ్లు, క్యారెట్ జ్యూస్ వంటివన్నీ తీసుకుంటే మంచిది. శరీరాన్ని చల్లబరిచే పదార్థాల జోలికి వెళ్లకపోవడం ఉత్తమం. మాంసాహారం ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అన్నదాని మీద వాదోపవాదాలు ఉన్నాయి. అయితే ఎవరి అనుభవం మీద వారు సలహాలు ఇస్తున్నారు. నా సలహా మాత్రం మంసాహారం మంచిదే. అయితే మితిమీరి తినొద్దు..'' అన్నారాయన. "పౌష్టికాహారం తిని కూర్చోవడం కాదు. అందుకు తగ్గ వ్యాయామం చేయాలి. ఈ తరం దాన్ని మరిచిపోతోంది. శరీరాన్ని బాధపెడితే అది మనల్ని సుఖపెడుతుంది. శరీరాన్ని సుఖపెడితే అది మనల్ని బాధపెడుతుంది.. అన్నది నా సూత్రం'' అన్నారు. పదిమందితో కలిసి కష్టసుఖాలు పంచుకునే మనస్తత్వం, పరోపకార వ్యక్తిత్వాన్ని అలవరుచుకుంటే.. మానసిక ఒత్తిళ్లను జయించవచ్చు. మొండి వ్యాధుల్ని రాకుండా కాపాడుకోవచ్చు అన్నారు. క్యాన్సర్ మీద ఆయనకున్న అభిప్రాయాలతో అల్లోపతి వైద్యులు ఏకభవించకపోయినా.. కొందరు రోగులు మాత్రం తమకు నయం అవుతోందని డాక్టర్ దగ్గరున్న నోటుపుస్తకాల్లో రాసి మరీ వెళుతున్నారు. అలాంటి నోటుపుస్తకాల కట్టను ఒకదాన్ని ముందు పెట్టారు బిన్ బదర్. అందులో అన్ని జిల్లాల నుంచి వచ్చిన క్యాన్సర్ పేషెంట్లు తమ వైద్య అనుభవాలతో పాటు చిరునామాలు కూడా రాసి వెళ్లారు.
Courtesy-Andhrajyothy

No comments:

Post a Comment