పట్టుదల, ఆత్మవిశ్వాసం, పోరాటపటిమ, జన్మనిచ్చిన ప్రాంతాభివృద్ధికి ఏదైనా చేయాలనే ఆరాటం ఉంటే చాలు...ఏదైనా సాధించవచ్చని నిరూపించారు హైకోర్టు న్యాయవాది భీమనాతి శంకర్. తన ఇద్దరు పిల్లల్ని చదివించి అమెరికాకు పంపించడంతో వారు అక్కడ స్థిరపడ్డారు. మూడున్నర దశాబ్దాలుగా హైకోర్టులో వకీలుగా పనిచేస్తున్న ఆయనకు సంతృప్తి ఇవ్వలేదు. దీంతోపాటు కుటుంబ బాధ్యతలు తీరిపోవటంతో, బాల్యదశలోనే వదిలివచ్చిన తన ప్రాంతాభివృద్ధికి ఏదైనా చేయాలని స్థిర నిర్ణయానికి వ చ్చి తన సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ఎలాంటి పదవీ లేకపోయినా అభివృద్ధి చేయాలనే సంకల్పం ఉంటే చాలు సామాన్యులు ఎంతటి పెద్ద పనులైనా పూర్తి చేయించవచ్చని నిరూపించారు సాధారణ న్యాయవాది శంకర్. స్వచ్ఛంద సేవే పరమావధిగా హైకోర్టు న్యాయవాది శంకర్ చేపడుతున్న కార్యక్రమాలు ఈ వారం సెకండ్ ఇన్నింగ్స్.
మాది కరీంనగర్ జిల్లా సారంగాపూర్ మండలంలోని మారుమూల గ్రామమైన నర్సింహులపల్లి. మాది వ్యవసాయ కుటుంబం. అయిదవ తరగతి వరకు మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి హైకోర్టు న్యాయవాదిగా ఎదిగాను. చదువు పూర్తయ్యాక హైదరాబాద్‌లోనే స్థిరపడ్డాను. నా ఇద్దరు పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారు. నిత్యం న్యాయవాద వృత్తిలో బిజీగా ఉండే నాకు కనీసం సెకండ్ ఇన్నింగ్స్‌లోనైనా నా స్వగ్రామానికి ఏదైనా చేయాలనే సంకల్పం కలిగింది. అంతే...చాలా రోజుల తర్వాత హైదరాబాద్ నగరాన్ని వదిలి మా గ్రామానికి తిరిగి వెళ్లాను. గ్రామంలోని పరిస్థితులు చూసి నా మనసు వికలమైంది. గ్రామంతోపాటు, మా మారుమూల వెనుకబడిన ప్రాంతాభివృద్ధికి ఏదైనా చేయాలని నిర్ణయానికి వచ్చాను.
సాగునీటి కాలువతో సస్యశ్యామలం
వ్యవసాయాధారమైన మా గ్రామ శివార్లలో గుట్టల మధ్య రోళ్ల వాగు చెరువు ఉంది. ఈ చెరువులో నీరు సంవత్సరం పొడుగునా ఊటలాగా ఊరుతున్నా మా రైతుల పొలాలకు అందని పరిస్థితిని గమనించాను. ఈ చెరువు నుంచి నీటిని పొలాలకు అందించేందుకు ఏం చేయాలని ఆలోచించాను. నా స్నేహితుడైన రిటైర్డు ఇంజనీరు చెన్నా విఠల్‌ను మా గ్రామానికి తీసుకు వచ్చి ఆయనకు చెరువులో నీటి ఊటను చూపించి, పొలాలకు ఎలా అందించాలని అడిగాను. ఆయన సర్వే చేసి 30 వేల రూపాయల వ్యయంతో కాలువ తవ్వుకుంటే పొలాలకు నీరందుతుందని చెప్పారు. గ్రామంలోని రైతులందరితో మాట్లాడి వారి నుంచి ఎకరానికి 300 రూపాయల చొప్పున విరాళాలు వసూలు చేసి, ఆ డబ్బుతో ఒద్దుళ్ల కాలువను తవ్వించాం.దీంతో ఈ కాలువ కింద ఉన్న భూముల్లో రెండు పంటలు పండుతున్నాయి.
కమ్మునూరు-కలమడుగు వారధి
చుట్టూ కొండలు, అడవుల మధ్య మారుమూలన ఉన్న 200 గ్రామాల ప్రజలకు గోదావరి నది అభివృద్ధికి ఆటంకంగా మారింది. కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల మధ్య ఉన్న గ్రామాల ప్రజల మధ్య సామాజిక, ఆర్థిక సంబంధాలున్నాయి. గోదావరి నది ప్రవాహం ఉన్నప్పుడు సంవత్సరంలో నాలుగైదు నెలలు రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోతుండేవి. వేసవి కాలంలో గోదావరిలో నీళ్లు లేనప్పుడు కాలినడకనే గోదావరి దాటి వెళుతుండేవారు. గోదావరి ప్రవహిస్తున్నప్పుడు ఆవల ఒడ్డుకు వెళ్లాలంటే 60 కిలోమీటర్ల దూరం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుండేది. ఈ సమస్యను చూసి ఆందోళన చెంది, మారుమూలన పడి ఉన్న 200 గ్రామాలు అభివృద్ధి చెందాలంటే గోదావరి నదిపై కమ్మునూరు-కలమడుగు వంతెన నిర్మించాలని డిమాండు చేస్తూ ఉద్యమాన్ని చేపట్టాను. కమ్మునూరు- కలమడుగు గోదావరి బ్రిడ్జి సాధన సమితిని ఏర్పాటు చేసి, దానికి కన్వీనర్‌గా ఉండి, మండలాల వారీగా సాధన సమితి కమిటీలు వేసి ఉద్యమం చేశాం. కరపత్రాలు విడుదల చేసి, గ్రామ గ్రామాన చేపట్టిన ఉద్యమంతో సర్కారులో కదిలిక వచ్చింది. గోదావరి బ్రిడ్జి సాధన సమితి విజ్ఞప్తికి స్పందించిన అప్పటి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి టి. జీవన్‌రెడ్డి సర్వే, అంచనాలను మూడు నెలల్లోనే పూర్తి చేయించి పనులు చేపట్టారు. ఈ వంతెన నిర్మాణం ఇటీవల పూర్తి అయింది. గోదావరి బ్రిడ్జి సాధన సమితిని ఏర్పాటు చేసి, అప్పటి జిల్లా మంత్రులైన జీవన్‌రెడ్డి, జువ్వాడి రత్నాకర్ రావులపై ఒత్తిడి తీసుకువచ్చి, వారి చేయూతతో గోదావరి నదిపై కమ్మునూరు వద్ద వంతెన నిర్మాణానికి వారధిగా నిలిచాను. సాధారణ న్యాయవాదినైనా ప్రజా ఉద్యమం ద్వారా ఎంతటి పెద్ద పనినైనా పూర్తి చేయించవచ్చని ఈ వంతెన నిర్మాణంతో నిరూపితమైంది. గోదావరిపై వారధి నిర్మాణంతో నన్ను బ్రిడ్జి శంకర్‌గా మా ప్రాంత ప్రజలు పిలవటం నాకెంతో సంతోషాన్నిస్తుంది.
ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి
మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చాలినన్ని తరగతి గదులు లేక విద్యార్థులు నానా అవస్థలూ పడుతున్నారు. పాఠశాలలో అదనంగా మూడు తరగతి గదులు నిర్మించేందుకు గ్రామస్థులందరి దగ్గర నుంచీ విరాళాలు పోగు చేసినా, ఆ డబ్బు కేవలం గోడల నిర్మాణానికే సరిపోయింది. అర్ధంతరంగా నిలిచిపోయిన మా గ్రామ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణాన్ని చూసి, నా సొంత డబ్బుతో పూర్తి చేయించాను. దీంతో నేను చదువుకున్న పాఠశాలకు పైకప్పు నిర్మాణం ద్వారా పాఠశాలతో నాకున్న రుణాన్ని తీర్చుకునే అవకాశం లభించడం నా అదృష్టంగా భావించాను.
హనుమాన్ ఆలయ నిర్మాణం
గ్రామ శివార్లలో ఉన్న హనుమాన్ విగ్రహం వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూ ఉండేది. దాన్ని చూసి బాధ పడి హనుమాన్ దేవాలయ నిర్మాణం చేపట్టాను. నా సొంత విరాళంతో పాటు కొందరు మిత్రులు అందించిన సహాయంతో దేవాలయ నిర్మాణం పూర్తి చేయించాను. దేవాలయంలో ప్రతి ఏటా హనుమజ్జయంతితోపాటు సీతారాముల కల్యాణం జరుపుతున్నాం. దేవాదాయ శాఖ ధూప దీప నైవేద్య పథకం కింద నిధులు మంజూరు చేయించి, మా గ్రామ ఆలయంలో నిత్య పూజలు జరిపేలా ఓ పూజారిని నియమించాను. మా గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లోని వికలాంగులకు నా వంతు కర్తవ్యంగా ఊతకర్రలు అందించి ఆదుకుంటున్నాను. అంగవైకల్యం బాలబాలికల చదువులకు ఆటంకం కారాదనే లక్ష్యంతో వికలాంగులకు చేయూతనిస్తున్నాను. ఇప్పటికే చాలామంది వికలాంగులకు ఆసరా అందించాను. నా ఊపిరి ఉన్నంతవరకూ నా ప్రాంతం అభివృద్ధి చేయడం ద్వారా జన్మభూమి రుణం తీర్చేందుకు స్వచ్ఛంద సేవలు కొనసాగిస్తా అంటూ ముగించారు హైకోర్టు న్యాయవాది శ ంకర్ తన సెకండ్ ఇన్నింగ్స్ కబుర్లు.
Courtesy-Andhrajyothy
No comments:
Post a Comment