Sunday, 10 November 2013

యువతరం బ్యాంకు ఉద్యోగ విజయాలు

లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడి, పట్టుదల, ఆత్మవిశ్వాసంతో చదివితే చాలు విజయాలు సాధించవచ్చని నిరూపించారా యువతీ యువకులు. ఇంజనీరింగ్ కళాశాలలో చదువు పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్‌మెంట్లలో ఉద్యోగావకాశాలు రాకపోయినా వారు కుంగి పోలేదు. చదివింది ఇంజనీరింగ్ అయినా బ్యాంకు ఉద్యోగాలు సాధించాలనే పట్టుదలతో కష్టపడి చదివి పోటీ పరీక్షలు రాసిన మొదటిసారే ర్యాంకులు సాధించి, ఇంటర్వ్యూల్లోనూ విజయాన్ని సొంతం చేసుకుని బ్యాంకు అధికారులయ్యారు. ముగ్గురు యువతీ, యువకులు సాధించిన ఉద్యోగ విజయాలు ఈ వారం 'యంగ్'

వారంతా కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్‌లలో బీటెక్ చదివారు. ఇంజనీరింగ్ డిగ్రీలు చేతికొచ్చినా, కళాశాలల్లో జరిగిన క్యాంపస్ సెలక్షన్స్‌లలో వారికి ఉద్యోగాలు రాలేదు. సాఫ్ట్‌వేర్ రంగం దెబ్బతినడంతో ఇంజనీరింగ్ అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు తగ్గుముఖం పట్టాయి. నిజానికి కొందరు యువకులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కోల్పోయి నిరుద్యోగులయ్యారు కూడా. అయితే, ఐటి రంగం పరిస్థితి మందగించడంతో దేశంలో బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగావకాశాలు అనూహ్యంగా పెరిగాయి. దీంతో పలువురు ఇంజనీరింగ్ యువకులు సైతం బ్యాంకు ఉద్యోగాల వైపు దృష్టి సారించి విజయం సాధిస్తున్నారు.

కష్టపడి చదివి...
"మాది కర్నూలు జిల్లా శ్రీశైలం పట్టణం. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ చదివి ఉద్యోగాన్వేషణలో ఉన్నప్పుడు బ్యాంకు ఉద్యోగాల భర్తీకి జారీచేసిన నోటిఫికేషన్ కనిపించింది. చదివింది ఇంజనీరింగ్ అయినా, ఎలాగైనా బ్యాం కు ఉద్యోగం సంపాదించాలనే పట్టుదలతో కష్టపడి చదివాను. రాత పరీక్షతోపాటు ఇంటర్వ్యూలోనూ ఎంపికై బెంగళూరులో బ్యాంకింగ్ సర్వీసెస్‌లో పీజీ డిప్లొమా చేశాను. ప్రొబేషనరీ ఆఫీసరుగా శిక్షణ పూర్తి చేసి, యాక్సిస్ బ్యాం కులో అసిస్టెంట్ మేనేజరుగా చేరాను. సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా చేరిన నా స్నేహితుడొకరు పెళ్లి చేసుకున్నాక ఉద్యోగం కోల్పోయాడు. దీన్ని దృష్టిలో ఉంచుకొ ని ఉద్యోగ భద్రతతోపాటు ఆకర్షణీయమైన జీతాలున్న బ్యాంకు ఉద్యోగంలో చేరాను. ఈ ఉద్యోగం నాకెంతో సంతృప్తినిచ్చింది'' అంటారు పి. విశ్వనాథ్.

సమయపాలనతోనే సక్సెస్
"మాది గుంటూరు పట్టణం. నా చదువయ్యాక గుంటూరు కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేసేదాన్ని. నా పెళ్లయ్యాక హైదరాబాద్‌కు మకాం మార్చడం జరిగింది. అయితే, ఎలాగైనా కష్టపడి చదివి బ్యాంకు ఉద్యోగం సాధించాలనే తపనతో చదివాను. బ్యాంకు ఉద్యోగాలకు నిర్వహించిన రాత పరీక్షలో సమయం ముఖ్యం. తక్కువ సమయంలో వేగంగా సమాధానాలిచ్చేలా చేసిన ప్రాక్టీసుతోనే నాకు ఉద్యోగం వచ్చింది. బ్యాంకు పరీక్షల కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవటంతోపాటు క్రమశిక్షణతో చదివాను. దీంతో నాకు వరుసగా ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంకు, బ్యాంకు ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకులలో ఉద్యోగాలు వచ్చాయి. గత ఏడాది ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాం కులో అసిస్టెంట్ మేనేజరుగా చేరాను. పట్టుదలగా చదివితే చాలు సులభంగా విజయం సాధించవచ్చని అనిపిస్తోంది'' అంటారు పసుపులేటి స్వర్ణబిందు.

కమ్యూనికేషన్స్ స్కిల్స్
"నేను గత సంవత్సరమే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ స్కిల్స్‌లో బీటెక్ పూర్తి చేశాను. ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సెలక్షన్స్‌లో నాకు ఉద్యోగం లభించలేదు. దీంతో బ్యాంకు ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో హైదరాబాద్‌కు వచ్చి ప్రత్యేకంగా శిక్షణ పొంది పరీక్షలకు ప్రిపేరయ్యాను. బీటెక్‌లో నేను పెంచుకున్న కమ్యూనికేషన్స్ స్కిల్స్ నాకు బ్యాంకింగ్ పరీక్షలో ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఉద్యోగ భద్రతతో పాటు గౌరవప్రదమైన బ్యాంకు ఉద్యోగంపై ఆసక్తితో ఐబీపీఎస్ పరీక్ష రాసి, మంచి మార్కులు సాధించి, ఇంటర్వ్యూలోనూ విజయం సాధించి బ్యాంకు ఆఫ్ బరోడాలో చేరాను. కష్టపడి చదివి సాధించుకున్న బ్యాంకు ఉద్యోగం నాకెంతో నచ్చింది'' అంటారు బి. ప్రజ్వల్. కష్టపడి చదివితే చాలు కోరుకున్న ఉద్యోగం లభిస్తుందని ఈ యువతీ యువకులు నిరూపించారు.

వచ్చే ఐదేళ్లలో 7.5 లక్షల ఉద్యోగావకాశాలు
దేశంలో బ్యాంకింగ్ రంగం వేగంగా విస్తరిస్తోంది. కొత్త బ్యాంకుల ఏర్పాటుతోపాటు ఉన్న బ్యాంకులు తమ శాఖలను విస్తరిస్తున్నాయి. దీనికి తోడు లక్షలాది మంది బ్యాంకు అధికారులు, ఉద్యోగులు పదవీ విరమణ చేస్తున్నారు. దీనివల్ల వచ్చే అయిదేళ్లలో 7.5 లక్షల మందికి బ్యాంకుల్లో ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఆకర్ణణీయమైన జీతాలతోపాటు ఉద్యోగ భద్రత, సమాజంలో గౌరవం ఉన్న బ్యాంకు ఉద్యోగాలు నేటి యువతరానికి ఎంతో అనువైనవి. హైటెక్ పరిజ్ఞానంతోపాటు వేగంగా పనిచేయగలిగే యువత బ్యాంకు రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో సునాయాసంగా విజయం సాధించవచ్చు.
-ఎం. రామేశ్వర్, బ్యాంకింగ్ నిపుణులు, హైదరాబాద్
Courtesy-Andhrajyothy

No comments:

Post a Comment