Wednesday, 6 November 2013

మాట ఒప్పందం చెల్లదా?

30 ఏళ్ల క్రితం మా ఉమ్మడి ఇంటి స్థలాన్ని అక్క, అన్న, నేను సమానంగా పంచుకుని రిజిస్టర్ చేయించుకున్నాం. అందులో అక్కకు చెందిన ఒక వాటాలో ముగ్గురం కలసి ఇల్లు కట్టుకున్నాం. అయితే ఆ స్థలం ముగ్గురికి సరిపోయేంత లేదని నా వాటా భూమిని రూ. 40 వేలకు అమ్మడానికి అంగీకరించాను. అప్పుడు మా అక్క, అన్న ఆ భూమిని సమానంగా పంచుకుని రిజిస్టర్ చేశాను. డబ్బులు వెంటనే ఇవ్వలేమని చెబితే, నన్ను మోసం చెయ్యరనే నమ్మకంతో నేను రిజిస్ట్రేషన్ కాగితాల మీద సంతకం చేశాను. ఆ తరువాత మా అన్నయ్య వాటాను కూడా మా అక్కయ్యే కొనేసింది. ఆ తరువాత నేను డబ్బులు అడిగితే 'నీకేమీ బాకీలేను. ఏం చేసుకుంటావో చేసుకొ'మ్మని మా అక్కయ్య మొండిగా మాట్లాడుతోంది. మా అన్నయ్యను అడిగితేనేమో నేననేం చేయలేను అంటున్నాడు. ఇప్పుడు నాకు రావలసిన వాటా స్థలాన్ని కోర్టు ద్వారా తిరిగి పొందే అవకాశం ఉందా? అప్పుడు చేసిన రిజిస్ట్రేషన్ చెల్లుబాటు కాకుండా చేసే మార్గమేదైనా ఉందా? సరియైన సలహా ఇవ్వండి.

- సి. ప్రకాశ్, నెల్లూరు

మీరు మీ వాటా భూమిని మీ అక్క, అన్నలకు ఏ సంవత్సరం రిజిస్టర్ చేశారో తెలియచేయలేదు. దీనికి తోడు ఆ రిజిస్టర్ దస్తావేజులో ఆ భూమి ఖరీదు డబ్బు మీకు ముట్టిందని రాశారా, లే క ఆ తరువాత చెల్లిస్తామన్న మాటకు ఒప్పుకున్నట్టుగా రాశారా అన్న విషయం కూడా రాయలేదు. ఏ వ్యక్తి అయినా తన స్థిరాస్తులను ఇతరులకు రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా ఒకసారి అన్యాక్రాంతం చేసిన తరువాత ఆ దస్తావే జును రద్దుపరచడం సాధ్యం కాదు. రిజిస్టర్డ్ దస్తావేజులను కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే రద్దు పరచ డానికి వీలుంటుంది. అంటే మీ సంతకాన్ని ఎవరైనా ఫోర్జరీ చేసి కానీ, లేదా చట్ట వ్యతిరేక విధానంలో ఆ ఆస్తిని పొందినప్పుడు మాత్రమే అలా అవకాశం ఉంటుంది. అంటే మీ ఆస్తి ఏ ప్రదేశంలో ఉందో అక్కడి సివిల్ కోర్టును సంప్రదించి ఆ రిజిస్టర్ దస్తావేజును రద్దు చేయించవచ్చు.

మీ విషయానికి వస్తే మీకు రావలసిన 40 వేల మొత్తానికి కేవలం పెద్ద మనుషుల ముందు ఒప్పందం కుదుర్చుకుని ఆ తరువాత చెల్లించడం లేదని రాశారు. ఆ విషయాలు లిఖితపూర్వకంగా ఏమీ లేనప్పుడు చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవడం వీలుపడకపోవచ్చు. పైగా ఇలాంటి విషయాల్లో డబ్బు వసూలు అన్నది మూడేళ్ల వ్యవధిలోపలే చేయవలసి ఉంటుంది. పైగా మీ అన్నయ్యకూడా తన వాటాను రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా మీ అక్కగారికే అమ్మేశారు కాబట్టి, మీ అన్నయ్య కూడా మీకు ఏ విధంగానూ సహకరించలేరు. ఒకవేళ మీరు చేసిన రిజిస్టర్డ్ దస్తావేజులో ఆ డబ్బులు తరువాత ఇస్తార న్న ఒప్పందం ఉంటే అప్పుడు ఆ డబ్బును వడ్డీతో సహా వసూలు చేయడానికి వీలుంటుంది. అలాంటి సమయాల్లోనే మీరు సివిల్ న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చు. ఒకవేళ మీరు రాసి ఇచ్చిన రిజిస్టర్డ్ దస్తావేజులో మీకు డబ్బులు ముట్టినట్లుగా రాసి ఉంటే ఆ డబ్బు వారి నుంచి వసూలు చేయడం సాధ్యం కాదు.

1967లో మా వారు నన్ను రెండో పెళ్లి చేసుకున్నారు. మొదటి భార్యకు ఐదుగురు పిల్లలు, నాకు ఇద్దరు. పిల్లలందరికీ 1986 నాటికే పెళ్లిళ్లు చేశాం. 2005లో 130 గజాల స్థలం కొని 2007లో ఇల్లు కట్టుకుని మేమిద్దరమూ అందులో ఉంటున్నాం. ఈ ఇంటికి సంబంధించిన పన్ను, ప్లాను దస్తావేజు, కరెంట్, నల్లా బిల్లు అన్నీ నా పేరిటే ఉన్నాయి. అంతకు ముందున్న బ్యాంక్‌లోన్, గోల్డ్‌లోన్ అన్నీ తిరిగి చెల్లించి వేశాం. అయితే, నా భర్త మొదటి సంతానంలో కొందరు నా తదనంతరం ఈ ఇంట్లో వారికీ వాటా వస్తుందంటున్నారు. నిజానికి ఆ ఇంటిని నా పిల్లల మాత్రమే ఉండాలనుకుంటున్నాను. చట్టపరంగా ఈ సమస్యకు పరిష్కారమేమిటో తెలియచేయండి.
- బి. పద్మావతి, తెనాలి.

మీరు 130 గజాల ఆ స్థలాన్ని మీ పేరు మీద కొన్నారా? లేక మీ భర్త పేరు మీద కొన్నారా? అన్న వివరాలేవీ తెలియచేయలేదు. ఒకవేళ మీ భర్త పేరు మీద కొని ఉంటే, ఆయన ఇప్పటికీ జీవించి ఉంటే, లేదా మీ భర్త మీ ఇద్దరి పేరు మీద ఆ భూమిని కొని గృహ నిర్మాణం చేసి ఉంటే ఇద్దరూ ఆ ఇంటికి యజమానులవుతారు. వాస్తవానికి మీరు స్వార్జితంగా కొన్న ఆస్తిని మీరు బతికున్నప్పుడు ఆ ఇంటిని మీ ఇష్టానుసారం ఎవరికైనా బదలాయించవచ్చు. మీ భర్త, మీ మీద ఆ ఇల్లు ఉన్నట్లయితే, మీరిద్దరూ మీ తదనంతరం ఆ ఇల్లు ఎవరికి చెందాలనే విషయాన్ని తెలుపుతూ వీలునామా రాయవచ్చు. లేదా మీరు బ్రతికుండగానే గిఫ్ట్ సెటిల్‌మెంట్ ద్వారా మీరు అనుకున్న వారికి చెందేలా చేయవచ్చు. మీరు బతికుండగా ఎవరి పేరు మీదా వీలునామా రాయకుండా, ఎవరి పేరు మీదా గిఫ్ట్ సెటిల్‌మెంట్ చేయకుండా చనిపోయినప్పుడు మాత్రమే మీ భర్త మొదటి భార్య ద్వారా జన్మించిన పిల్లలు, మీ ద్వారా జన్మించిన పిల్లలకు ఆ ఆస్తి మీద సమాన హక్కులు ఉంటాయి. ఆ భూమిని మీ భర్త పేరు మీద కొని ఉంటే మీ భర్త ఇంకనూ బతికి ఉంటే మీ భర్తను మీరు ఆశించిన రీతిలో ఒక వీలునామా రాయమనండి. లేదా గిఫ్ట్ సెటిల్‌మెంట్ డీడ్ చేయించుకుంటే, మీరు ఆ భూమిని ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నారో వారికి చట్టపరమైన ఇబ్బందులేమీ ఉండవు.\
Courtesy-Andhrajyothy

No comments:

Post a Comment