సర్కారీ బడులో కార్పొరేట్ విద్య
'ప్రభుత్వ
పాఠశాలలు వద్దు - ప్రైవేటు బడులే ముద్దు' అన్న ఆలోచనను మన బుర్రల్లోంచి
తీసెయ్యగలమా? 'అందరూ తలోచెయ్యీ వేస్తే అదెంతసేపు?' అంటున్నారు మెదక్ జిల్లా
మందపల్లి గ్రామస్థులు. కేవలం అని ఊరుకోలేదు, ఆచరణలోనూ చూపించారు.
వాళ్లందరి కృషి వల్ల కిందటేడు 48మంది పిల్లలున్న బడి ఇప్పుడు 142మంది
పిల్లలతో కళకళలాడుతోంది.
మెదక్ జిల్లా చిన్నకోడూరు మండలంలోని మందపల్లి చిన్న ఊరు. అక్కడి ప్రాథమిక పాఠశాల అన్ని బడుల్లాగానే ఉండేది. కిందటేడు గట్టిగా యాభైమంది విద్యార్థులు కూడా లేరు. ఎక్కువమంది పిల్లలు దగ్గర్లోని సిద్ధిపేట ప్రైవేటు స్కూళ్లకు వెళ్లేవారు. ఈ విద్యాసంవత్సరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిగా చేరిన మేఘమాలకు పరిస్థితి అర్థమయింది. తమ బడిని అన్ని హంగులతో తీర్చిదిద్దాలన్న పట్టుదల కనబరిచారామె. తోటి ఉపాధ్యాయులు వెంకట్‌రామ్‌రెడ్డి, పర్శరాములుగౌడ్ కూడా కలిసొచ్చారు. తల్లిదండ్రులు పిల్లలను ప్రైవేటు స్కూళ్లకు ఎందుకు పంపుతున్నారో ఆలోచించారు. అక్కడ విద్యుత్తు, ఫ్యాన్లు వంటి కనీస సౌకర్యాలుంటాయి, ఇంగ్లీషులో బోధన సాగుతుంది. ఇవి రెండూ ఉంటే బడి మెరుగవుతుందని ఆలోచించి ముందుగా ఒక ప్రణాళికను రూపొందించారు.
పెద్దలొచ్చారు...
ముందుగా సౌకర్యాల కోసం గ్రామ నాయకులను సంప్రదించారు ఉపాధ్యాయులు. పెద్దవాళ్లంతా పెద్దమనసు చేసుకున్నారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు దేవునూరి తిరుపతి 22 వేల రూపాయల ఖర్చుతో పాఠ్యపుస్తకాలు అందజేశారు. అల్లీపూర్‌కు చెందిన బండి ఆగయ్యగౌడ్ ఆరువేల విలువైన ఫ్యాన్‌లిచ్చారు. చేర్యాలకు చెందిన స్వచ్చంద సంస్థ మధ్యాహ్న భోజనం కోసం 200 ప్లేట్లు అందజేసింది. గ్రామ సర్పంచ్ అనసూయ పిల్లలకు టై, బెల్టులు పంపిణీ చేశారు. గ్రామంలోని జిందం కోమలశ్రీనివాస్, సిద్ధిపేటకు చెందిన పిల్లల వైద్యులు కె.శివరామచారి తదితరులు మైక్ సెట్, వాయిద్య పరికరాలు, క్రీడా సామాగ్రి మొదలైనవి ఇప్పించారు. అన్ని హంగులూ సమకూర్చుకున్నాక ఊళ్లోని పెద్దవాళ్లతో సమావేశమయ్యారు ఉపాధ్యాయులు.
నాణ్యతకే పెద్దపీట
'ప్రైవేటు చదువులంటే డబ్బు చాలా ఖర్చవుతుంది. రోజూ పైఊరికి వెళ్లి రావడమంటే మాటలు కాదు. ఈ వ్యయప్రయాసలు మీకెందుకు' అంటూ గ్రామస్థులకు నచ్చజెప్పారు. అందరూ సహకరిస్తే నాణ్యమైన విద్యను తామే అందిస్తామని హామీ ఇచ్చారు. తల్లిదండ్రులు అంగీకరించారు. ఉన్నత విద్యార్హతలున్న యువకులు విద్యావలంటీర్లుగా పనిచెయ్యడానికి ముందుకొచ్చారు. ఎమ్మెస్సీ బీఈడీ పూర్తి చేసిన డి.స్వామి, బీఎస్సీ బీఈడీ చదివిన డి.ప్రభాకర్, బిటెక్ అభ్యర్థి శ్యామ్, ఎంఎ తెలుగు చదువుకున్న బి.రాజులు వలంటీర్లుగా బడిలో చేరారు. వారికి ప్రభుత్వం నుంచి ఎక్కువ మొత్తంలో గౌరవ వేతనం వచ్చే అవకాశం లేదు. దాంతో పిల్లల తల్లిదండ్రులు, దాతలు 80 వేల రూపాయలు పోగు చేసి బడికి అందించారు. ఈ మొత్తం ద్వారా వచ్చే వడ్డీని - నెలకు మూడు వేల రూపాయల గౌరవ వేతనం ఇవ్వడానికి ముందుకొచ్చింది పాఠశాల విద్యాకమిటీ. వీటన్నిటికీ మండల విద్యాధికారి రఘోత్తమ్‌రెడ్డి పూర్తి సహకారం అందించారు.
ఆదర్శప్రాయం
అంతా సిద్ధమయ్యాక, మంచిరోజు చూసి బడిలో అక్షరాభ్యాస కార్యక్రమం చేపట్టారు. అ,ఆలతో పాటు ఏబీసీడీలు దిద్దించడం మొదలు పెట్టారు. తరగతిలో పాఠం చెప్పి వదిలెయ్యడం కాకుండా విద్యార్థులను బృందాలుగా విభజించి అందులోని విషయాలన్నిటినీ చర్చించే విధానాన్ని అమలులోకి తెచ్చారు. ఫలితంగా విద్యార్థులలో అవగాహన, సృజనాత్మకత పెరిగాయి. పాఠశాల ఆవరణలోని ఖాళీ స్థలంలో పండ్ల మొక్కలతో పాటు కూరగాయలు పెంచి మధ్యాహ్న భోజనంలో వినియోగించి విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారు. గత సంవత్సరం వరకు తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులను ఈ మార్పులకు అనుగుణంగా సంసిద్ధం చేసేందుకు ప్రతి రోజు సాయంత్రం ఒక గంటసేపు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 నుంచి 4 గంటల వరకు ఉచితంగా నవోదయ కోచింగ్ ఇస్తున్నారు. ఉపాధ్యాయులు పూనుకుంటే, ఊరు సాయమందిస్తే అన్ని ప్రభుత్వ పాఠశాలలూ ఇలా ముందడుగెయ్యడం ఎంతసేపు?
- ఏటి బాబు, చిన్నకోడూరు

Courtesy-Andhrajyothy
No comments:
Post a Comment