Wednesday, 30 October 2013

సాధించాల్సిన లక్ష్యానికి చేరుకోవాలంటే

ఏదైనా సాధించాలన్న కోరిక, ఆత్రుత అందరిలోనూ వుంటాయి. కానీ అందులో కొంతమందే తమ లక్ష్యాల్ని సాధిస్తున్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించలేక మొదటి అడుగులోనే ఆగిపోయేవారు ఎందరో.. దేశ జనాభాలో 45శాతం మంది యువతే. వీరంతా ఏదో సాధించాలిన తపన పడుతుంటారు. కొందరు చిన్న ఉద్యోగం సంపాదించి అదే జీవితం అనుకుంటారు. ఇలా మొదటి అడుగులోనే ఆగిపోయే చాలామంది మనసు పెడితే సమున్నత లక్ష్యం సొంతం చేసుకోవటం ఏమంత కష్టం కాదు. సాధించాల్సిన లక్ష్యానికి చేరుకోవాలంటే ఇష్టమైన రంగాన్ని ఎంచు కొని ముందుకు సాగాలి. అవేమిటో ఒక్కసారి పరిశీలించండి మరి!
వ మీ ఏరియాలో ఇంతవరకూ ఎవరూ ప్రారంభించని అందరూ ఎవరైనా పెడితే బాగుణ్ణు అని ఎదురుచూసే వ్యాపారాలేమైనా ఉన్నాయా అని పరిశీలించండి. అలాంటి వ్యాపారం ప్రారంభిస్తే తప్పకుండా గెలవడం తథ్యం! ఉదాహరణకి కొరియర్ సర్వీస్, మొబైల్ లెండింగ్ లైబ్రరీ, అలాగే ఇల్లు మారినపుడు మీ సామాను అంతా చక్కగా ప్యాక్ చేసి వేరేచోటికి మార్చే ‘ప్యాకర్స్ మరియు మూవర్స్’ అనేవి అతి కొద్దికాలంలోనే ఎంతగా ప్రాచుర్యం పొందాయో అందరికీ తెలిసిన విషయమే!
వ ఏ విషయాన్నైనా పాజిటివ్‌గా తీసుకునే అలవాటుని చేసుకోండి. దీనివల్ల జీవితంలో ఎలాంటి కష్టనష్టాలు ఎదురైనా తేలిగ్గా ఎదుర్కోవచ్చు. గజనీ మహమ్మద్ ఇరవై ఏడుసార్లు ఓడిన తర్వాతే మన దేశంపై విజయం సాధించగలిగాడు. అబ్రహం లింకన్ ఎన్నో కష్టాల్ని అనుభవించిన తర్వాత అమెరికాకి ప్రెసిడెంట్ అవగలిగాడు. మనిషికి ఆత్మవిశ్వాసం, గెలుస్తాం అన్న నమ్మకం వుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు
వ దృఢ సంకల్పం చేసే పని మీద పూర్తి అవగాహన మనకి చాలా ముఖ్యం! వాళ్లు చెప్పారు, వీళ్లు చెప్పారు అని వాళ్లూ, వీళ్లూ చెప్పినవి విని చేసి, ఆ తర్వాత నష్టం వస్తే నష్టం ఒక్కటే కాదు, అనుబంధాలు కూడా. అందువల్ల ఏదైనా ఒక పనిని ప్రారంభించేముందు ఎవరి మాటలూ వినకుండా మీకు మీరుగా దాని గురించి బాగా తెలుసుకుని, ఆ పనివల్ల నష్టాలెన్ని, లాభాలెన్ని అని బాగా బేరీజు వేసుకుని ప్రారంభించండి. ఒకవేళ అనుకోకుండా ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా నష్టం వస్తే, ఇలా కూడా నష్టం వచ్చే పరిస్థితి వుందని తెలుసుకుని దాన్ని అధిరోహించడానికి ప్రయత్నించండి!
వ ఏదైనా సాధించాలంటే ముందుగా కావలసింది ఇంటిలోని వాళ్ల ప్రోత్సాహం! అంతేకాకుండా ఎలాంటి సమస్యనైనా మీరే పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. అంతేకాని ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని కూర్చుంటే మాత్రం నష్టపోయేది మీరే!
వనిజాయితీగా వుండండి. లక్ష్యసాధనకి నిజాయితీ చాలా ముఖ్యం. ఎదుటివాళ్లదగ్గర మనం నిజాయితీపరులమని, మాట కచ్చితం కలవారమని నిరూపించుకుంటే చాలు- మన పనుల్లో గానీ, వ్యాపారంలోగానీ ఎంత ఎత్తుకి ఎదగగలమో మీకే తెలుస్తుంది.
వ అనుకున్నది సాధించాలన్న ఆశ, దానికోసం పడే తాపత్రయం మాత్రమే లక్ష్యసాధనకి ఉపయోగపడదు. మీలోనూ మార్పు కనిపించాలి. ఎపుడు చూసినా సీరియస్‌గా వుండకూడదు. గలగలా నవ్వుతూ అందర్నీ నవ్విస్తూవుండాలి. మీ దగ్గర పనిచేసే వాళ్లతో కలిసిపోతూ, అందర్నీ కలుపుకుని పోతే మీ లక్ష్యసాధన చాలా తేలికైపోతుందన్నది ముమ్మాటికీ నిజం!
వ ఈ సందర్భంలో మనం ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండం విశే్వశ్వరయ్య చెప్పిన మాటల్ని గుర్తుచేసుకోవాలి. ‘‘నేనొక రోడ్లు ఊడ్చే పనివాడినయితే ప్రపంచంలోనే అత్యుత్తమ రోడ్లు ఊడ్చే పనివాడినని పేరు తెచ్చుకోవడానికి కృషి చేస్తాను. నన్ను మించిన వాళ్లు ఈ ప్రపంచంలోనే లేరన్నట్లుగా పేరు తెచ్చుకుంటాను’ అన్న మాటల్లో నిజమెంత దాగుందో తెలుసుకోవాలి. మనం చేసే పని ఎటువంటిదయినా అందులో నూటికి నూరు శాతం మన మనస్సుని కేంద్రీకరించి చేసినపుడు విజయం మనదే అవుతుంది.
వ సాధించాలన్న కోరిక వున్నపుడు, మనమీద వచ్చే విమర్శల్ని పట్టించుకోకూడదు. ఎప్పుడూ ఎవరో ఒకరిపైన, ఏదో ఒకటి చెబుతూనే వుంటుంది లోకం! విమర్శలు వచ్చినపుడే మనస్సుని కంట్రోల్ చేసుకోవాలి. విమర్శలకి క్రుంగిపోవడం, పొగడ్తలకి పొంగిపోవడం చెయ్యక, సాధించి తీరాలన్నదే లక్ష్యంగా పెట్టుకుని పోయినపుడు ఈ విమర్శకులెవరూ కనిపించకుండా పోతారు.
లక్ష్యసాధనలో చాలా ముఖ్యమైనది నమ్మకం! ముందు మన మీద, మనం చేసే పనిమీద మనకి గాఢ నమ్మకం వుండాలి. మనలోని బలం ఏమిటి? బలహీనతలు ఏమిటి? అన్నవి తెలుసుకుని, బలహీనతల్ని అధిగమించడానికి ప్రయత్నించినపుడు విజయం మీ చెప్పుచేతల్లో వుంటుందన్నది నిజం!
వ ఒకేసారి రెండు మూడు పనుల్ని చెయ్యాలనుకోకూడదు. అందువల్ల మనం పనుల్ని సరిగ్గా చెయ్యలేకపోవడమో లేక ఏదో గెలిచామన్న పేరుకి గెలవడమో జరుగుతుంది. అంతేకాని ఎందులోనూ గొప్పగా పేరు తెచ్చుకోలేము. అందరూ, అన్నింటిలోనూ గొప్పగా రాణించడమన్నది అసాధ్యం! ఎవరికీ సాధ్యపడదు కూడా. అందువల్ల సాధ్యమైనంత వరకూ సాధించాలని అనుకున్న ఒక్కదానిలో నిష్ణాతులైన వుండడానికి ప్రయత్నించండి.
కలలు కనండి కలలే మీరు సాధించబోయే అపూర్వ విజయాలకి పునాదులు. కలల ద్వారా పొందే ఉత్సాహమే మిమ్మల్ని లక్ష్యసాధన వైపుకి దూసుకుని వెళ్లేలా చేస్తుంది.
తర్వాత ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? అన్న తలంపు ఎప్పుడు వుంటుండాలి. ఈ తలంపు లేనందువల్లే చాలామంది ఎదుగూ బొదుగూ లేకుండా వున్న సీట్లో అలాగే వుండిపోవడం జరుగుతుంది.
పైన చెప్పిన విషయాలన్నీ గుర్తుంచుకుని ఆచరిస్తే తప్పకుండా లక్ష్యసాధనలో మీరే ముందుంటారన్నది ముమ్మాటికీ నిజం!
Courtesy-AndhraBhoomi

No comments:

Post a Comment