Tuesday, 29 October 2013

సమాచార సమృద్ధి... పల్లెల అభివృద్ధి

‘పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు’ అన్నారు గాంధీజీ. స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు దాటినా ఆ మహాత్ముడు ఆకాంక్షించిన గ్రామ స్వరాజ్యాన్ని పూర్తిస్థాయిలో సాధించుకోలేకపోయాం. పంచాయితీ వ్యవస్థ సమస్యలకు నిలయంగా మారడమే దీనికి నిదర్శనం. విజ్నప్తులతో వెళ్లే ప్రజలకు మూతపడ్డ కార్యాలయాలు దర్శనమిస్తున్నాయి. సమాచారం దొరికే పరిస్థితీ లేదు. అడిగే వారు లేరు... అడిగితే సమాధానం ఇచ్చే వారు కనిపించరు. ఇన్నాళ్లూ నిలదీసే దారి తెలియక పల్లెల్లో సమస్యలు రాజ్యమేలాయి. ఇపుడు... మనకు మార్గం దొరికింది. అదే సమాచార హక్కు చట్టం.
ప్రభుత్వ కార్యాలయం అనగానే గుర్తొచ్చేది అధికారుల నిర్లక్షమే. చాలా చోట్ల చేతులు తడిపితే కానీ పనులు కావు. కనీసం పలుకుబడి అయినా ఉండాలి. లేకుంటే రోజుల తరబడి తిప్పటం, ఫలానా కాగితాలు లేవనో... నిబంధనలు ఒప్పుకోవనో వంకలు పెట్టడం. క్షేత్ర స్థాయి కార్యాలయాల్లో ఇటువంటివి మరీ ఎక్కువ. సగటు గ్రామీణుడికి తరచూ ఏదో ఒక పని పడేది పంచాయితీ కార్యాలయంతోనే. మన పనుల్ని అధికారులు ఎంత వ్యవధిలో చెయ్యాలి, అలా జరగకపోతే ఏం చెయ్యాలి? ఈ విషయాల గురించి చాలా మందికి తెలియదు.

పౌరులకు సకాలంలో మేలైన సేవలను అందించటం ప్రభుత్వోద్యోగుల విధి. ఆ సేవలను ఎన్ని రోజుల్లోగా పూర్తి చెయ్యాలో నిర్ధేశించేది పౌర సేవాపత్రం (సిటిజన్ ఛార్టర్). అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ దీన్ని బహిరంగంగా ప్రదర్శించాలి. ఇవి సమర్ధంగా అమలైనప్పుడే ప్రజలకు నాణమైన, ఉత్తమ సేవలు అందుతాయి.
చట్ట ప్రకారం చేద్దాం!
పంచాయితీ పరిధిలో ఇంటి నిర్మాణ అనుమతి కోసం అవసరమైన అన్ని పత్రాలను జతపరుస్తూ దరఖాస్తు చేసుకోవాలి. పౌర సేవా పత్రం ప్రకారం పరిహేను రోజుల్లోగా (కింద పట్టికలో) గ్రామ కార్యదర్శి దాన్ని పరిష్కరించాలి. అందుకు లంచాలు, పైరవీలు అవసరం లేదు. గడువులోగా అనుమతి ఇవ్వకపోతే సమాచార హక్కు చట్టం సెక్షను 6(1) ప్రకారం దరఖాస్తు చేసుకోవాలి. రోజువారీ ప్రగతి, దరఖాస్తుపై తీసుకున్న చర్యల నివేదికలు కోరవచ్చు. ఈ వివరాలను పొందడానికి ఎటువంటి రుసుము అవసరంలేదు. జీవో.ఎం.ఎస్. 1825, జీఏడీ, తేదీ 26.12.1959, జిల్లా కార్యాలయాల నియమావళి పేరా 26-ఎ ప్రకారం ప్రజల విజ్నప్తి పత్రాలు, ఫిర్యాదులు స్వీకరించినట్టు తపాలు గుమస్తా / సంబంధిత అధికారి పూర్తి సంతకం, ముద్రతో రశీదును దరఖాస్తుదారునికి ఇవ్వాలి. రశీదు ఇవ్వకపోతే రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తును పంపవచ్చు. దరఖాస్తు నకలును, రిజిస్టర్ పోస్టు తిరుగు రశీదును భద్రపరచుకోవాలి. మీ దరఖాస్తును ఉద్ధేశపూర్వకంగా తొక్కిపెట్టినా, 30 రోజుల్లోగా సమాచారం ఇవ్వకపోతే పై అధికారికి అప్పీలు చేయవచ్చు.

పౌర సేవా పత్రంలోని గడువులోగా దరఖాస్తు / ఫిర్యాదును పరిష్కరించని అధికారుల నుంచి వినియోగదారుల రక్షణ చట్టం 1986 సెక్షను 2(1)(ఓ)(జి) ప్రకారం సేవా లోపానికి నష్టపరిహారాన్నీ ప్రజలు పొందవచ్చు. ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న చోట మీ దరఖాస్తు ఎక్కడ నిలిచిపోయింది? ఏ అధికారి వల్ల జాప్యం అయింది? వివరాలనూ ఇప్పుడు సమాచార హక్కు ద్వారా తెలుసుకోవచ్చు.
గ్రామ పంచాయితీల పౌర సేవాపత్రం
పని రోజులు
- ఇంటి నిర్మాణానికి అనుమతి - 15
- ఇంటి నీటి కుళాయి కనెక్షను మంజూరు - 30
- లే అవుట్ దరఖాస్తులు పరిశీలించి పై అధికారులకు పంపడం - 15
- ఆస్తులను ఇతరులకు బదిలీ చేయటం - 15
- లైసెన్సలు జారీ చేయడం - 5
- బోరింగ్, చేతిపంపుల మరమ్మతులు - 3
- వీధి స్తంభాలకు బల్బులు, ట్యూబ్ లైట్లు తిరిగివేయడం - 2
- వీధుల్లో నిల్వ ఉన్న మురుగు నీటిని తొలగించడం - 2
- రహదారుల కోత, గుంతలు పూడ్చడం - 3
- చెత్తకుండీ శుభ్రపరచడం - 2
- పైపులైను లీకేజీ మరమ్మతులకు - 1
Courtesy-Yuvanirman

No comments:

Post a Comment